Pakistan: దావూద్ విషయంలో 24 గంటలైనా గడవకముందే పాకిస్థాన్ యూటర్న్

Pakistan Takes A UTurn On Presence Of Dawood Ibrahim In Karachi
  • తనకు అలవాటైన బుద్ధిని మరోమారు ప్రదర్శించిన పాక్
  • దావూద్‌ తమ దేశంలో లేడని, అతడికి ప్రవేశం లేదని పేర్కొన్న దాయాది
  • భారత్ మీడియా పాక్‌కు వ్యతిరేకంగా కథనాలు రాస్తోందని మండిపాటు
పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు 88 నిషేధిత ఉగ్రసంస్థలు, దాని అధినేతలపై ఆంక్షలు విధించింది. ఇందులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ ముసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. వీరి ఆస్తులను, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. ఫలితంగా దావూద్ తమ దేశంలోనే ఉన్నాడని చెప్పకనే చెప్పింది.

ఈ జాబితాలో దావూద్ పేరును చేర్చి కొన్ని గంటలైనా గడవకముందే పాకిస్థాన్ తనకు అలవాటైన బుద్ధిని మరోమారు ప్రదర్శించింది.  దావూద్ తమ దేశంలో లేడని, అతడికి తమ దేశంలోకి అసలు ప్రవేశమే లేదని పేర్కొంది. భారత మీడియా కావాలనే దావూద్ తమ దేశంలో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. గతంలో జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్)ను బూచిగా చూపుతూ భారత మీడియా కథనాలు నడిపిస్తోందని, అది సరికాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి అన్నారు.
Pakistan
Dawood Ibrahim
India
Karachi

More Telugu News