Andhra Pradesh: ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సులు తిరిగే టైమొచ్చింది!

  • ప్రయాణికులను అడ్డుకుంటున్న కొన్ని రాష్ట్రాలు
  • ప్రైవేటు వాహనాల్లో వెళుతూ ప్రజల ఇబ్బందులు
  • ప్రయాణికులపై ఆంక్షలు వద్దని కేంద్రం ఆదేశాలు
  • త్వరలోనే బస్సులను తిప్పే అవకాశం
Interstate Buses Expecting to Start

రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణికులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని, కొన్ని రాష్ట్రాలు ప్రజలను తమ రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయని, ఇకపై అలా చేయవద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీని తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు కీలక చర్చలు జరపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో బస్సులు తిరుగుతున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్యా ఆర్టీసీ, ప్రైవేటు బస్ సర్వీసులు లేవన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కర్ణాటక నుంచి వస్తున్న బస్సులను ఏపీ అనుమతిస్తోంది. తమిళనాడు, తెలంగాణ నుంచి మాత్రం బస్సులను అనుమతించడం లేదు.

ఇక అత్యవసర పనులపై ప్రయాణాలు సాగించాల్సిన వారు, సొంత వాహనాల్లోనో, అద్దె వాహనాల్లోనో సరిహద్దుల వద్దకు వెళ్లి, నిబంధనల మేరకు స్క్రీనింగ్ తరువాత తమ గమ్యాలకు చేరుతున్నారు. ప్రైవేటు వాహనాల భారం చాలా అధికంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇదే సమయంలో మార్చి నుంచి బస్సులను తిప్పకపోవడంతో, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కేంద్రం నుంచి గట్టి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో, తిరిగి బస్సులను పునరుద్ధరిస్తే, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ఈ విషయంలో ఏపీ అధికారులతో నేడో, రేపో చర్చించనున్నామని టీఎస్ ఆర్టీసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఈ చర్చల అనంతరం, హైదరాబాద్, ఇతర ముఖ్య పట్టణాల నుంచి ఏపీలోని ఏఏ ప్రాంతాలకు ఎన్ని బస్సులను నడపాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని, తొలుత పరిమిత సంఖ్యలో బస్సులను నడుపుతూ, క్రమంగా సర్వీసుల సంఖ్యను పెంచుతామని వెల్లడించిన అధికారులు, ఈ నెలాఖరు నుంచి బస్సులు తిరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా, ఏపీ, తెలంగాణల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సుల సంఖ్య సమానంగా ఉండాలని రెండు నెలల క్రితం జరిగిన ఆర్టీసీ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రద్దీ అధికంగా ఉండే హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - కర్నూలు రూట్లలో తామెన్ని బస్సులను నడిపిస్తే, ఏపీ కూడా అన్నే బస్సులను తిప్పాలని తెలంగాణ కోరుతోంది.

వాస్తవానికి తెలంగాణలోని పలు ప్రాంతాలకు, ముఖ్యంగా హైదరాబాద్ కు ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులే అధికంగా వస్తుంటాయి. ఏపీలోని ప్రతి ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ కు కనీసం ఒక బస్సు నడుస్తోంది. విజయవాడ నుంచి సుమారు 100కు పైగా బస్సులు వస్తుంటాయి. తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు అధికంగా ఉన్నాయని, బస్సుల సంఖ్య సమానంగా ఉండేలా చూస్తే, నష్టాలు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు టీఎస్ ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

More Telugu News