Muslims: కరోనా పేరిట విదేశీ ముస్లింలను బలిపశువులను చేశారు: కేసులన్నీ కొట్టేసిన బాంబే హైకోర్టు!

Forigners Made Scapegoat in Tablighi Jamaat Case
  • 29 మంది విదేశీయులపై కేసులు
  • టూరిస్ట్ వీసాలను ఉల్లంఘించారని అభియోగాలు
  • వారి కారణంగానే కరోనా వ్యాపించిందని ప్రచారం
  • విదేశీయులను అనసరంగా ఇబ్బంది పెట్టారన్న ధర్మాసనం
  • అతిథులను గౌరవించే సంప్రదాయం ఏమైందని ప్రశ్న
కరోనా కారణంగా న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కు వచ్చిన 29 మంది విదేశీ ముస్లింలను బలిపశువులను చేశారని అభిప్రాయపడ్డ బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్, వారిపై నమోదైన కేసులను కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలకమైన వ్యాఖ్యలను చేసింది. దేశంలో కరోనా వ్యాప్తికి వారే కారణమంటూ అనవసర ప్రచారం జరిగిందని జస్టిస్‌ టీవీ నాలావాడే, జస్టిస్ ఎంజీ సెవ్లికర్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు ఏ మాత్రం మానవత్వం లేకుండా, రాజకీయ బలవంతానికి లొంగారని పేర్కొంటూ, సోషల్‌ మీడియాలో సైతం వీరి గురించి తప్పుగా ప్రచారం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి విదేశీయులు రావడంతోనే దేశంలో వైరస్ వ్యాప్తి జరిగిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

దేశంలో మహమ్మారి విస్తరిస్తున్న వేళ, ప్రభుత్వాలన్నీ కలిసి విదేశీ ముస్లింలను ఇందుకు బాధ్యులను చేశాయని, వారిని బలిపశువులను చేశారని, వారిపై ఐపీసీ, ఎపిడెమిక్ డిసీజస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్... ఇలా పలు సెక్షన్లతో కేసులు పెట్టారని, వారంతా టూరిస్ట్ వీసా నిబంధనలు ఉల్లంఘించారని కూడా అభియోగాలను నమోదు చేశారని గుర్తు చేసిన న్యాయస్థానం, టూరిస్ట్ వీసాలపై వచ్చిన వారు, మతపరమైన ప్రార్థనా స్థలాలకు వెళ్లరాదన్న నియమం లేదని వ్యాఖ్యానించింది.

అతిథులను స్వాగతించి, గౌరవించే గొప్ప సంప్రదాయం మనదని, ఈ సంస్కృతిని ప్రజలు నిజంగానే పాటిస్తున్నారా? అని ప్రశ్నించిన ధర్మాసనం, విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కొన్ని పాజిటివ్ స్టెప్స్ తీసుకోవాలని సూచించింది.
Muslims
Scapegoat
Bombay Highcourt
Corona Virus
Tablighi Jamaat

More Telugu News