COVID-19: కరోనాకు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తున్న అమెరికా శాస్త్రవేత్తలు!

  • ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో విజయవంతం
  • అభివృద్ధి చేస్తున్న వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్
  • త్వరలోనే మనుషులపై ప్రయోగం
Nasal vaccine for covid US scientists

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్త‌ృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని క్లినికల్ ట్రయల్స్‌లో ఉండగా, మరికొన్ని తుది పరీక్షల్లో ఉన్నాయి. మరోవైపు, అమెరికా శాస్త్రవేత్తలు కొత్త తరహా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎలుకలపై జరిపిన పరీక్షల్లో ఈ టీకా విజయవంతంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫసర్ మైఖేల్ డైమండ్ తెలిపారు. టీకా ఇచ్చిన ఎలుకల్లో రోగ నిరోధక శక్తి పెరిగినట్టు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు ఎలుకలకు మాత్రమే ఇచ్చామని, జంతువులు, మనుషులపై తదుపరి అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

జలుబుకు కారణమయ్యే అడినో వైరస్‌కు స్పైక్ ప్రొటీన్లను ఎక్కించిన అనంతరం ఆ కణాలకు జరిపిన పరీక్షల ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్టు డాక్టర్ డేవిడ్ క్రూయిల్ తెలిపారు. కొవిడ్ చికిత్సలో అడినో వైరస్ వ్యాక్సిన్లను చేయి, తొడ కండరాలకు మాత్రమే ఇస్తారని, ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారని అన్నారు. ఒక్క డోస్‌తోనే కరోనాను నియంత్రించినట్టు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్‌ను ఈ టీకా సమర్థంగా నియంత్రించినట్టు వివరించారు.

More Telugu News