Ayush Ministry: అలా అంటారా?.. ఆయుష్ కార్యదర్శి రాజేశ్‌పై చర్యలు తీసుకోవాల్సిందే: కనిమొళి డిమాండ్

  • ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్చువల్ శిక్షణ కార్యక్రమం
  • హిందీ రానివారు బయటకు వెళ్లిపోవాలన్న రాజేశ్ కొటెచ్చా
  • దుమారం రేపుతున్న వ్యాఖ్యలు
Hindi Domination Says DMK MP Kanimozhi

తాను హిందీలోనే మాట్లాడతానని, అది మాట్లాడడం రానివారు శిక్షణ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవచ్చంటూ ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటెచ్చా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాజేశ్ వ్యాఖ్యలపై డీఎంకే నేత, ఎంపీ కనిమొళి తీవ్రస్థాయిలో స్పందించారు.

ఇలాంటి వివక్ష ఇంకెంతకాలమని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను విడనాడాలని అన్నారు. ఆయుష్ కార్యదర్శి రాజేశ్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఈ మేరకు ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్‌కు లేఖ రాశారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు.  కాంగ్రెస్ ఎంపీ, చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం రాజేశ్ వ్యాఖ్యలను ఖండించారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి రాజేశ్ కొటెచ్చా మాట్లాడుతూ.. హిందీ మాట్లాడడం రాని, అర్థం చేసుకోలేని యోగా టీచర్లు, మెడికల్ ప్రాక్టీస్‌నర్లు బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాజేశ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో వివాదాస్పదమైంది. రాజేశ్ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News