India: చైనా బొమ్మలను చూస్తారుగా? అటువంటివి మీరు చేయలేరా? యువతకు నరేంద్ర మోదీ ప్రశ్న!

  • టాయ్ ఇండస్ట్రీ అభివృద్ధిపై దృష్టి
  • నూతన విధి విధానాలపై మోదీ చర్చ
  • వినూత్నమైన బొమ్మలు తయారు చేయాలని పిలుపు
Modi Asked Youth for Unique Toys

ఇండియాలోని స్టార్టప్ కంపెనీలు, యువత టాయ్ ఇండస్ట్రీపై దృష్టిని సారించి, వినూత్నమైన బొమ్మలను తయారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ఎంతో అభివృద్ధి చేయాల్సి వుందని అభిప్రాయపడ్డ ఆయన, ఈ రంగం విస్తరణకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన నూతన విధివిధానాలపై శనివారం నాడు మంత్రులు, అధికారులు, బొమ్మల తయారీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. 

'ఏక్ భారత్, శ్రేష్ణ భారత్' సాకారం కావాలంటే, టాయ్ ఇండస్ట్రీ ఎంతో కీలకమని పేర్కొన్న మోదీ, వినూత్నమైన బొమ్మలను తయారు చేసే స్టార్టప్ కంపెనీలను ఆదుకుంటామని, వారి కోసం ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఉన్నామని అన్నారు. ఇండియాలో ఎన్నో బొమ్మల తయారీ పరిశ్రమలు ఉన్నాయని, ఎంతో నిపుణులైన కార్మికులు కూడా ఉన్నారని వ్యాఖ్యానించిన ఆయన, చిన్నారుల్లో మానసిక శక్తిని, జిగ్నాసను పెంచే బొమ్మలను తయారు చేసి చూపించాలని కోరారు. 

ప్రస్తుతం భారత్ లో చైనాలో తయారవుతున్న టాయ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, భారత ఔత్సాహికులు మరింత వినూత్నంగా ఆలోచించి విభిన్నమైన బొమ్మలను తయారు చేయాలని నరేంద్ర మోదీ కోరారు. ఈ సమావేశం అనంతరం మోదీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ఈ విషయంలో విద్యా సంస్థలు హాకథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలని, పర్యావరణానికి మేలు కలిగించే బొమ్మల తయారీని ప్రోత్సహించాలని సూచించారు.

More Telugu News