Woman: ఇతనేం మొగుడు... నాకొద్దు బాబూ... ఒక గొడవ లేదు, ఒక అలక లేదు!: విడాకులు కోరిన భార్య

Woman in Uttar Pradesh wants divorce for unusual reasons
  • భర్త తనను ఏమీ అనడంలేదంటూ భార్య ఫిర్యాదు
  • ఇంత మంచివాడ్ని తాను భరించలేనన్న భార్య
  • పిటిషన్ చూసి కంగుతిన్న షరియా కోర్టు మతపెద్ద
ఉత్తరప్రదేశ్ లోని ఓ యువతి అసాధారణ రీతిలో విడాకులు కోరుతూ షరియా కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ తనకు విడాకులు ఎందుకు కావాలో ఆమె చెప్పిన కారణం వింటే విస్తుపోతారు. పెళ్లయిన నాటి నుంచి భర్త అతి ప్రేమతో విసిగిపోయానని, ఒక తిట్టు లేదు, ఒక గొడవ లేదు అంటూ వాపోయింది. ఉత్తరప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన ఈ యువతికి 18 నెలల కిందటే పెళ్లయింది. భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఎంతగా అంటే ఆ భరించలేనంత ప్రేమతో తనకు విసుగొచ్చేస్తోందని, కనీసం ఒక్కసారైనా గొడవ పడదామంటే ఆ అవకాశమే ఇవ్వడంలేదని ఆ యువతి అసహనం వ్యక్తం చేస్తోంది.

18 నెలల్లో తనను పల్లెత్తు మాటైనా అనలేదని, ఇలాంటి భర్త తనకు వద్దని కరాఖండీగా చెప్పేసింది. అతడి అతి ప్రేమను జీర్ణించుకోలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాలంటూ ఆమె సంభల్ జిల్లా షరియా కోర్టులో దరఖాస్తు చేసుకుంది. "అతడు నాకు వంట పనుల్లోనూ, ఇంటి పనుల్లోనూ సాయపడేవాడు. ఏ విషయంలోనూ నన్ను అరిచేవాడు కాదు. ఇలాంటి వాతావరణంలో ఉండలేకపోతున్నాను. నేను ఎప్పుడు తప్పు చేసినా నన్ను క్షమించేవాడు. నాకేమో అతడితో వాదనకు దిగాలనిపించేది. ప్రతిదానికి తలూపే భర్తతో నేను కొనసాగలేను" అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఆమె చెప్పిన కారణాలు విన్న షరియా కోర్టు మతపెద్ద నివ్వెరపోయాడు. వాటిలో ఏ ఒక్కటీ లోక విరుద్ధం కానప్పుడు తామెలా విడాకులు ఇస్తామంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించాడు. భర్త ఒక్క చెడ్డపని చేశాడని చెప్పినా విడాకులు మంజూరు చేస్తాం అని ఆయన స్పష్టం చేసినా, ఆమె ఒక్క కారణం కూడా చెప్పలేకపోయింది.  స్థానిక పంచాయితీలోనూ ఆమెకు అదే తీర్పు ఎదురైంది. ఇక, ఆమె భర్త దీనిపై మాట్లాడుతూ, తాను ఓ అసలుసిసలైన భర్తలా ఉండాలని అనుకుంటున్నానని తెలిపాడు. షరియా కోర్టు ఈ వివాదంపై భార్యభర్తలే పరిష్కరించుకోవాలని సర్దిచెప్పింది.
Woman
Divorce
Sharia
Husband
Sambhal District
Uttar Pradesh

More Telugu News