Nalgonda District: నల్గొండ జిల్లా యువతిపై 11 ఏళ్లుగా 143 మంది 5 వేల సార్లు అత్యాచారం.. నిందితుల్లో నటులు, యాంకర్లు!

  • 142 పేజీలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
  • వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
  • పెళ్లితోనే ప్రారంభమైన కష్టాలు
Nalgonda girl raped 5 thousand times police file 42 page FIR

హైదరాబాద్, పంజగుట్టలో నమోదైన ఓ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. గత 11 సంవత్సరాలుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారని, వీరిలో నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు, విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారని బాధిత యువతి పేర్కొంది. సోమాజీగూడలో నివసించే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో 42 పేజీలతో కూడిన ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలేనికి చెందిన బాధితురాలు (25)కి 2009లో మైనర్‌గా ఉండగానే మిర్యాలగూడకు చెందిన కె.రమేశ్ అనే యువకుడితో వివాహమైంది. ఆ తర్వాతి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. భర్త, ఆడపడుచు, అత్త, మామ, సోదరులతో పాటు వారి బంధువులు దాదాపు 20 మంది శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. అవమానాలు, వేధింపులను మనసులోనే దాచిపెట్టుకున్న యువతి 9 నెలల తర్వాత విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుంది. అక్కడ ఉంటూనే తిరిగి చదువు కొనసాగించింది.

ఈ క్రమంలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక అప్పటి నుంచి అతడితోపాటు గత 11 ఏళ్లలో ఎంతోమంది నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లారని, వారితోపాటు వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఇలా ఇప్పటి వరకు తనపై 5 వేల సార్లు అత్యాచారం చేశారని వాపోయింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన 138 మందితోపాటు గుర్తు తెలియని మరో ఐదుగురు పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొంది.

అత్యాచారం సందర్భంగా తీసిన ఫొటోలు, నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారని, తాము చెప్పినట్టు వినకపోతే కాల్చి చంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో మద్యం కూడా తాగించేవారని పేర్కొంది. పలుమార్లు గర్భస్రావం చేయించారని చెప్పింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో కొందరు తనను చంపేస్తానని బెదిరించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. వారి ఆగడాలు భరించలేని తాను  గాడ్‌ పవర్‌ ఫౌండేషన్‌ సంస్థను కలిశానని, అక్కడి వారి సహకారంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదుతో 42 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిన్న సాయంత్రం ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, వాంగ్మూలం నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News