Vellampalli Srinivasa Rao: అంత ప్రేమే ఉంటే కనుక సొంత నియోజకవర్గానికి వచ్చి వినాయకచవితి ఉత్సవాల్లో పాల్గొనాలి!: రఘురామకృష్ణరాజుకు వెల్లంపల్లి సవాల్

Vellampalli Srinivas comments on Raghurama Krishnaraju
  • వినాయకచవితి నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య రగడ
  • పండుగను ఇంట్లోనే జరుపుకోవాలన్న సర్కారు
  • విపక్షాల వ్యాఖ్యలు సరికాదన్న వెల్లంపల్లి
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినాయకచవితి వేడుకలపై పండితులు, మతపెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని, దీనిపై విపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకునే తాము వినాయకచవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ప్రజలకు సూచించామని, ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

ఈ అంశంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కూర్చుని వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఐదు నెలలుగా సొంత నియోజకవర్గానికి రాని రఘురామకృష్ణరాజుకు అంత ప్రేమే ఉంటే సొంత నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి వేడుకల్లో పాల్గొనాలని అన్నారు. రఘురామకృష్ణరాజు ప్రస్తుతం చంద్రబాబు డైరెక్షన్ లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భద్రతా కారణాలతో గత కొంతకాలంగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నారు.
Vellampalli Srinivasa Rao
Raghurama Krishnaraju
Vinayaka Chavithi
New Delhi

More Telugu News