బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ రెడీ.. కొవిడ్ రోగులకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లు!

21-08-2020 Fri 12:44
  • నేడు సమావేశం కానున్న కేంద్ర ఎన్నికల సంఘం
  • వచ్చే నెల 20న షెడ్యూల్ విడుదల?
  • ర్యాలీలు, బహిరంగ సభలపై ప్రత్యేక మార్గదర్శకాలు
CEC Ready for Bihar Elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. కొవిడ్-19 నేపథ్యంలో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఎన్నికలు సజావుగా నిర్వహించాలని యోచిస్తోంది. అలాగే, కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా పోలింగు బూత్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే బహిరంగ సభలు, ర్యాలీలపైనా మార్గదర్శకాలు రూపొందించినట్టు సమాచారం. ర్యాలీలు, బహిరంగ సభల్లో భౌతిక దూరం పాటించేలా ఆయా ప్రదేశాల్లో మార్కింగ్ చేయాలని ఈసీ యోచిస్తోంది. అలాగే, ప్రస్తుతం ఉన్న పోలింగ్ స్టేషన్లను మరో 50 శాతం పెంచనుంది.

బీహార్ ఎన్నికల నేపథ్యంలో నేడు సమావేశం కానున్న ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహణ, మార్గదర్శకాలపై చర్చించనుంది. అలాగే వచ్చేనెల 20న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ లోపు రాజకీయపార్టీలు, వివిధ ప్రాంతాల చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనుంది. అనంతరం వాటిని క్రోడీకరించి మార్గదర్శకాలను రూపొందించనుంది. బీహార్ ఎన్నికలను రెండుమూడు దశల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టు సమాచారం.