Jagan: రేపు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించనున్న జగన్

CM Jagan to visit Srisailam projetct tomorrow
  • పర్యాటకశాఖపై జగన్ సమీక్ష
  • 12 నుంచి 14 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆదేశం
  • హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచన
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరాలపై అధికారులతో చర్చించనున్నారు. దీంతోపాటు, ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియపై కూడా చర్చలు జరపనున్నారు.

మరోవైపు, ఈరోజు జగన్ పర్యాటకశాఖపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అనుకూలంగా నూతన టూరిజం పాలసీ ఉండాలని ఆదేశించారు. పర్యాటకరంగంలో ఏపీకి తగిన స్థానం లభించేలా కృషి చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 వరకు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఒక మంచి విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని జగన్ చెప్పారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం కలిగేలా ఆ కాలేజీ ఉండాలని అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి సగం పూర్తైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Jagan
Srisailam Project
YSRCP

More Telugu News