Wildfire: అమెరికాలో కార్చిచ్చు బీభత్సం... అగ్నికీలల్లో ఉత్తర కాలిఫోర్నియా

  • అమెరికాలో పిడుగుల వాన
  • వేలాది ఎకరాల అడవి దగ్ధం
  • ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
  • మంటలను ఆర్పే క్రమంలో హెలికాప్టర్ పైలెట్ మృతి
Wildfire spreads rapidly in Northern California

అమెరికాలో కార్చిచ్చు విలయతాండవం చేస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాను కార్చిచ్చు చుట్టుముట్టింది. వేలాది ఎకరాల అటవీప్రాంతం అగ్నికీలల్లో చిక్కుకుని దగ్ధమైంది. పెద్ద ఎత్తున వన్యప్రాణులు మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా ఏర్పడ్డ పొగలు, బూడిద శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని కమ్మేశాయి. అధికారులు హెలికాప్టర్లను ఉపయోగించి కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొత్తం 186 చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్చిచ్చు వ్యాపించినట్టు గుర్తించారు. ఇది క్రమంగా పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, మంటలను ఆర్పే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఓ హెలికాప్టర్ పైలెట్ మృతి చెందాడు. కోలింగా పట్టణ సమీపంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ కార్చిచ్చుకు వాతావరణ మార్పుల వల్ల పడిన పిడుగులే కారణమని భావిస్తున్నారు. అధికవేడిమికి తోడు మూడ్రోజుల వ్యవధిలో 11 వేల పిడుగులు పడడంతో కార్చిచ్చు బయల్దేరిందని అంచనా వేశారు. కార్చిచ్చు కారణంగా ఉత్పన్నమైన వెలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు కూడా కనిపించింది.

More Telugu News