India: అనుకున్న సమయం కన్నా ముందుగానే ఇండియాలో వ్యాక్సిన్... అత్యవసర ఆదేశాలు ఇవ్వడానికైనా సిద్ధమేనన్న ఐసీఎంఆర్!

  • ఇండియాలో వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్
  • తప్పనిసరి అనుకుంటే ముందుగానే మార్కెట్లోకి
  • ముందుగా వస్తే, యువతకు తొలుత వ్యాక్సిన్
  • పార్లమెంటరీ కమిటీ ముందు ఐసీఎంఆర్ అధికారి
ICMR Says India can Release Vaccine Before Trails With Emergency Order

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ విషయంలో అత్యవసర ఆదేశాలు ఇవ్వడం ద్వారా అనుకున్న సమయం కన్నా ముందుగానే ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు సిద్ధమని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్ లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్, జైడస్ కాడిలా వ్యాక్సిన్ జైకోవిడ్ లు రెండో దశ ట్రయల్స్ ను పూర్తి చేసుకోనున్నాయి.

మరోపక్క, జాతి యావత్తూ, ఓ సురక్షితమైన వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఇదే సమయంలో వ్యాక్సిన్ ను మార్కెట్లోకి వదిలేందుకు అత్యవసర ఆదేశాల అంశం తెరపైకి వచ్చింది. వ్యాక్సిన్ ట్రయల్స్ రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకోవడం, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా నిరోధక యాంటీ బాడీలు పెరగడం, సైడ్ ఎఫెక్ట్ లు కూడా పెద్దగా నమోదు కాకపోవడంతో, 'ఎమర్జెన్సీ ఆథరైజేషన్' ద్వారా వ్యాక్సిన్ ను రిలీజ్ చేసి, యువతకు ఇవ్వాలని భావిస్తున్నట్టు ఐసీఎంఆర్ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడించగా, వారి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నప్పటికీ, అత్యవసరమని భావిస్తే, వెంటనే దాన్ని విడుదల చేసేందుకు సిద్ధమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ స్వయంగా వ్యాఖ్యానించినట్టు కమిటీలోని ఓ ప్రజా ప్రతినిధి మీడియాకు తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు పూర్తయి, ఫలితాలు రావడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని భార్గవ చెప్పారని, అయితే, తప్పదని ప్రభుత్వం భావిస్తే, వెంటనే రిలీజ్ చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన అన్నట్టు తెలిపారు.

More Telugu News