Apple: అమెరికా చరిత్రలో తొలిసారి... 2 ట్రిలియన్ డాలర్ల మార్క్ ను తాకిన యాపిల్!

  • పలు రకాల సేవల్లో విస్తరించిన యాపిల్
  • ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న సౌదీ ఆరామ్ కో
  • ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన యాపిల్ మార్కెట్ కాప్
Apple Market Cap Rises 2 Trillion Dollars

సాంకేతిక సేవల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకూ విస్తరించిన యాపిల్, మరో అరుదైన ఘనతను సాధించింది. అమెరికన్ లిస్టెడ్ కంపెనీల్లో తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్  కాప్ ను సాధించడం ద్వారా, ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి అమెరికన్ కంపెనీగా నిలిచింది. గడచిన జూలైలో సంస్థ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తరువాత యాపిల్ ఈక్విటీ విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది. వాల్ స్ట్రీట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడిదారులు, యాపిల్ పై నమ్మకాన్ని పెంచుకుంటున్నారని,ఐఫోన్ ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతూ ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు.

కాగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా, సౌదీకి చెందిన చమురు దిగ్గజం ఆరామ్ కో కొనసాగుతోంది. ఈ సంస్థ మార్కెట్ వాల్యూ సైతం గడచిన ఏడునెలల్లో 57 శాతం పెరిగింది. ఇక ఈ రెండు కంపెనీలనూ పక్కనబెడితే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తదితరాలు ట్రిలియన్ డాలర్ల విలువకు అటూఇటుగా ఉన్నాయి. మొత్తం మీద యూఎస్ టెక్నాలజీ సంస్థల సంయుక్త మార్కెట్ కాప్ 6 ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంది. కరోనా వైరస్ సమయంలోనూ ఐఫోన్ల అమ్మకాలు జోరుగా సాగడమే యాపిల్ మార్కెట్ విలువను పెంచింది.

More Telugu News