Facebook: 'బీజేపీ వ్యవహారం'తో ఫేస్ బుక్ ఉద్యోగుల్లో ఫ్రస్ట్రేషన్... ఉన్నతాధికారులకు ప్రశ్నల మీద ప్రశ్నలు!

  • నిజంగానే రాజకీయ కంటెంట్ ను నియంత్రిస్తున్నామా?
  • యాజమాన్యానికి లేఖ రాసిన 11 మంది ఉద్యోగులు
  • వాల్ స్ట్రీట్ కథనం తరువాత సంస్థలో కలకలం
  • ఇంకా సమాధానం చెప్పని ఫేస్ బుక్ మేనేజ్ మెంట్
Facebook Employees Frestration on Company Rules

"మన కంపెనీకి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఇండియాలో, రాజకీయ కంటెంట్ ను నిజంగానే నియంత్రిస్తున్నామా?" ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. వారు దీన్నే ఉన్నతోద్యోగులను అడుగుతున్నారు. వారిలో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్, ఫేస్ బుక్ లోని టాప్ లాబీయింగ్ ఎగ్జిక్యూటివ్ అంకీ దాస్ ను కూడా తాకిందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు పెడుతున్న ఇంటర్నల్ పోస్టులు కొన్ని మీడియా సంస్థలకు కూడా అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ దిగ్గజంగా ఉన్న ఫేస్ బుక్, ఇప్పుడు ఇండియాలో పౌర సంబంధాల విషయంలో, రాజకీయ పోస్టుల విషయంలో కష్టాల్లో పడింది. రెండు రోజుల క్రితం అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ, కంపెనీ విద్వేష పూరిత వ్యాఖ్యల నిబంధనలను మోదీకి సన్నిహితుడైన ఓ నేతకు వర్తింపజేసేందుకు దాస్ అంగీకరించలేదన్నది ఈ కథనం సారాంశం. సదరు నేత తన పోస్టుల్లో ముస్లింలపై వ్యాఖ్యలు చేస్తూ, వారిని దేశ ద్రోహులుగా అభివర్ణిస్తున్నా ఏమీ పట్టించుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

కంటెంట్ రెగ్యులేషన్స్ విషయంలో అమలు చేయాల్సిన విధి విధానాలను అమలుచేయడం లేదని ఒక్క ఇండియాలోనే కాకుండా, అమెరికాతో పాటు పలు దేశాల్లో పనిచేస్తున్న ఫేస్ బుక్ ఉద్యోగులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. సంస్థలోని మిడ్ మేనేజ్ మెంట్ లో ఉన్న 11 మంది ఉద్యోగులు సంస్థ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ, ఓ అంతర్గత లేఖను రాయగా, అది బయటకువచ్చింది. మరిన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని వారు ఈ లేఖలో గట్టిగా చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న ముస్లిం వర్గానికి చెందిన ఉద్యోగులు ఈ విషయంలో యాజమాన్యం నుంచి తమకు స్పష్టత రావాలని గట్టిగానే కోరుతున్నారు.

అయితే, ఉద్యోగులు లేఖ ద్వారా ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై అటు ఫేస్ బుక్ భారత విభాగం గానీ, అంకీ దాస్ గానీ స్పందించక పోవడం గమనార్హం.

More Telugu News