Post Covid Clinic: కరోనా నుంచి కోలుకున్న వారిలో అనారోగ్య సమస్యలు.. ఢిల్లీలో పోస్ట్ కోవిడ్ క్లినిక్ ప్రారంభం!

  • రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో క్లినిక్ ప్రారంభం
  • కొందరిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయన్న కేజ్రీవాల్
  • దగ్గు, ఆయాసం, నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులు
Post Covid Clinic started in Delhi

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా పలు అనారోగ్య సమస్యలు వస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా నుంచి కోలుకున్న తర్వాత అలసట, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. ఇదే మాదిరి ఎందరో తిరిగి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పోస్ట్ కోవిడ్ క్లినిక్ ను ప్రారంభించింది. ప్రభుత్వ అధీనంలో ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ క్లినిక్ ను ప్రారంభించారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారికి ఈ క్లినిక్ లో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ షేర్వాల్ మాట్లాడుతూ, కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో పలు సమస్యలు వస్తున్నాయని... దగ్గు, ఆయాసం, నీరసం వంటి సమస్యలు వస్తున్నాయని... అన్ని వయసుల వారిలో ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, కరోనా నెగెటివ్ వచ్చి ఇంటికి వెళ్లిన వారిలో కొందరిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఇకపై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

More Telugu News