Adipurush: 'ఆదిపురుష్' టైటిల్ ప్రకటన 7:11 గంటలకే ఎందుకు?... ముహూర్తం సీక్రెట్ ను పట్టేసిన నెటిజన్లు!

  • ఓం రౌత్ దర్శకత్వంలో చిత్రం
  • విష్ణువు 7వ అవతారం శ్రీరాముడే
  • రాముడు పుట్టి 11 వేల ఏళ్లు
  • అందుకే ఆ ముహూర్తమంటున్న నెటిజన్లు
Secret Behind Adipurush Tittle Announcement Time

ప్రభాస్ హీరోగా, ప్యాన్ ఇండియా మూవీగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం టైటిల్ 'ఆదిపురుష్' అంటూ విభిన్నంగా కనిపించే లోగోను నిన్న ఉదయం 7 గంటలా 11 నిమిషాలకు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించి, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా టైటిల్ ముహూర్తం 7:11కే ఎందుకన్న విషయమై, నెట్టింట ఓ ఆసక్తికరమైన పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. మహావిష్ణువు దశావతారాల్లో శ్రీరాముని అవతారం ఏడవదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ లోనూ విల్లు సంధిస్తున్న రాముని నీడ కనిపిస్తుంది. ఆపై హనుమంతుడు, రావణుడు, కొందరు మునులు కనిపిస్తారు. 'మంచిపై చెడు సాధించిన విజయం' అంటూ క్యాప్షన్ కూడా కనిపిస్తుంది.

దీంతో సినిమా రామాయణం ఇతివృత్తానికి సంబంధించినది అయి ఉంటుందని తెలిసిపోతోంది. అదే సమయంలో రామాయణాన్నే తీస్తున్నారా? లేదా అదే కథను ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తారా? కాకుంటే, సోషియో ఫాంటసీగా ఉంటుందా అన్న విషయమై స్పష్టత లేదు. కాగా, ఈ సంవత్సరానికి శ్రీరాముడు జన్మించి 11 వేల సంవత్సరాలు అయ్యాయని చరిత్రలోని గణాంకాలు చెబుతున్న వేళ, 7వ విష్ణుమూర్తి అవతారం, 11 వేల ఏళ్ల వయసును దృష్టిలో ఉంచుకునే ఉదయం 7 గంటలా 11 నిమిషాలకు టైటిల్ ను ప్రకటించారని నెటిజన్లు అంటున్నారు.

ఇక ఈ ముహూర్తం వెనుక అదే కారణమా? లేక మరేదైనా ఉందా?అన్న విషయాలపై చిత్ర యూనిట్ స్పందిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ఏదిఏమైనా ఈ సినిమా టైటిల్ లోగో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News