Corona Virus: కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ధర ఎంత?: మూడు రోజుల్లో చెప్పాలని ఫార్మా కంపెనీలకు కేంద్రం ఆదేశం!

  • కంపెనీలతో సమావేశమైన నిపుణుల బృందం
  • ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషి
  • వెల్లడించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్
Center Crucial Meeting on Vaccine Price and Distribution

ఇండియాలోని ఐదు ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సమావేశమైన కేంద్ర నిపుణుల బృందం, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?దానికి ఎంత వరకూ ధర ఉండవచ్చు అనే వివరాలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. వ్యాక్సిన్ సిద్ధమైన వెంటనే దాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసి, ప్రజలకు అందించే ఆలోచనలో ఉన్నామని, అందువల్లే ధర, పంపిణీ విషయాలపై దృష్టిని సారించామని, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను చేరుస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలియజేశారు.

ఇప్పటికే వ్యాక్సిన్ ను సిద్ధం చేసి, క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ జైడస్ కాడిలా, సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, జెన్నోవా సంస్థలు కేంద్ర బృందంతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ కంపెనీల్లో రెండు హైదరాబాద్ కు చెందినవే కావడం గమనార్హం. వ్యాక్సిన్ వికటించకుండా, అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తరువాతనే ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో ఇండియా ఆచితూచి అడుగులు వేస్తోందని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు.

తమకు వ్యాక్సిన్ కావాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని, అయితే, ఇంతవరకూ ఎటువంటి ఒప్పందాలనూ కుదుర్చుకోలేదని స్పష్టంచేసిన ఆయన, సమీప భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను కూడా కోరామని తెలిపారు. ప్రాథమిక, బూస్టర్ టీకాలతో కలిపి, మొత్తం 68 కోట్ల డోస్ లు సిద్ధం కావాల్సి వుందని, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్నవారే లక్ష్యమని ఈ సమావేశంలో ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.

More Telugu News