Drive in Theater: లాక్ డౌన్ తరువాత న్యూఢిల్లీలో ప్రారంభమైన సినిమా స్క్రీనింగ్!

  • మార్చిలో మూతపడిన సినిమా హాల్స్
  • ఎన్సీఆర్ రీజియన్ లో తెరచుకున్న డ్రైవ్ ఇన్ థియేటర్
  • డిమాండ్ ను బట్టి షోల సంఖ్య పెంచుతామన్న సన్ సెట్ మూవీస్
First Movie Screening in New Delhi After Lockdown

కరోనా మహమ్మారి కారణంగా మార్చి నెల రెండో వారంలో దేశవ్యాప్తంగా సినిమా హాల్స్ మూతపడిన సంగతి తెలిసిందే. తిరిగి మూవీ థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో, న్యూఢిల్లీలో ఓ డ్రైవ్ ఇన్ సినిమా తిరిగి తెరచుకుంది. ఎన్సీఆర్ రీజియన్ లో ఉన్న సన్ సెట్ సినిమా క్లబ్ లో లాక్ డౌన్ తరువాత తొలిసారిగా సినిమాను ప్రదర్శించారు.

ప్రేక్షకులంతా ఈ థియేటర్ లో భౌతిక దూరం పాటించేలా సినిమా చూశారని, అందరూ మాస్క్ లు వేసుకుని ఉన్నారని, తమతమ వాహనాల్లోనే కూర్చుని 30 అడుగుల వెడల్పున్న థియేటర్ లో సినిమాను చూశారని సన్ సెట్ ప్రతినిధి సాహిల్ కపూర్ వెల్లడించారు. ఈ విధానంలో సినిమాలు సురక్షితంగా చూడవచ్చని, క్వాలిటీతో కూడిన ఆడియో నేరుగా కారులోకి ప్రవేశిస్తుందని అన్నారు.

కాగా, 1970 దశకంలోనే ఇండియాలో డ్రైవ్ ఇన్ థియేటర్లు అహ్మదాబాద్, ముంబై తదితర నగరాల్లో ఏర్పాటు కాగా, పెద్దగా ఆదరణ లేక, వాటిని మూసివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశంలో ఈ తరహా థియేటర్లు ఆరుండగా, అందులో రెండు న్యూఢిల్లీ శివార్లలోనే ఉన్నాయి. ఇక్కడికి తమ వాహనాల్లో వచ్చి, ప్రేక్షకులు సినిమాలను చూడవచ్చు. కాగా, ప్రేక్షకుల నుంచి డిమాండ్ అధికంగా ఉంటే, సెప్టెంబర్ నుంచి ప్రతి వారాంతంలో సినిమాలను ప్రదర్శిస్తామని సాహిల్ కపూర్ వ్యాఖ్యానించారు.

More Telugu News