Punjab: అదే జరిగితే పంజాబ్ అగ్నిగుండమే... కేంద్రానికి అమరీందర్ సింగ్ హెచ్చరిక!

  • సట్లేజ్, యమునాల మధ్య కెనాల్ కు ప్రతిపాదనలు
  • నిర్మిస్తే అది జాతీయ సమస్యగా మారుతుంది
  • అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై వివాదాలే
  • వీడియో కాన్ఫరెన్స్ లో అమరీందర్ సింగ్
Amarender Singh Warns Center on Sutlez Yamana Cannal

సట్లేజ్, యమునా నదులను కలపాలన్న కేంద్ర ఆలోచనను మానుకోవాలని, ఆ కాలువ నిర్మాణం జరిగితే, లింక్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తయితే పంజాబ్‌ ఓ అగ్నిగుండంలా మారుతుందని, నీటి పంపకాల విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తాయని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌‌ సింగ్‌ హెచ్చరించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ లతో కలసి ఓ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ కాలువ‌ నిర్మిస్తే ప్రజల్లో భావావేశాలు ప్రబలుతాయని, అది దేశ సమస్యగా మారుతుందని అన్నారు.

ఈ సమస్యను జాతీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని, కేంద్రం ముందుకు వెళ్లేందుకే సిద్ధపడితే, పంజాబ్ మారిపోతుందని, దీని కారణంగా హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడతాయని అమరీందర్ వ్యాఖ్యానించారు. ఆపై హర్యానా సీఎం ఖట్టర్‌ స్పందిస్తూ, తాను మరోమారు అమరీందర్‌‌ సింగ్‌తో సమావేశం అవుతానని అన్నారు. రెండు నదుల మధ్యా కాలువ నిర్మాణానికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

కాగా, 1966లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలు ఏర్పడిన తరువాత మొదలైన నదీ జలాల పంపకం వివాదం ఇప్పటికీ సద్దుమణగలేదు. తమకు అధిక వాటా కావాలని హర్యానా అడుగుతుండగా, పంజాబ్ ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ తీసుకొచ్చి జలాలను ఇరు రాష్ట్రాల మధ్య విభజించి, పంచుకొనేందుకు వీలుగా కాలువ ఏర్పాటుకు నిర్ణయించింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీ దళ్ తీవ్రమైన ఆందోళన కార్యక్రమాన్ని చేబట్టింది.

ఈ నేపథ్యంలో 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ తీసుకుని అకాలీదళ్ చీఫ్ హర్ చంద్ సింగ్ లోంగోవాల్ ను కలిశారు. దీంతో సమస్య పరిష్కారానికై ఒక ట్రైబ్యునల్ ఏర్పాటుకు వీరి మధ్య ఒప్పందం జరిగింది. ఇది జరిగిన నెల రోజులకే లోంగోవాల్ ను తీవ్రవాదులు హత్య చేశారు. తర్వాత 1990లో కాలువ నిర్మాణంపై ప్రణాళికలు రూపొందిస్తున్న చీఫ్ ఇంజనీర్ ఎంఎల్ శేఖ్రి, సూపరింటెండింగ్ ఇంజనీర్ అవతార్ సింగ్ లను మిలిటెంట్లు హత్య చేశారు. దీంతో కాలువ పనులు ఆగిపోయాయి. ఈ వివాదాన్ని ముగించేందుకు రెండు రాష్ట్రాల మధ్యా చర్చలు జరపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించగా, అప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయి. నీటిని పంచుకునేందుకు పంజాబ్ ఎంత మాత్రమూ అంగీకరించక పోవడం గమనార్హం.

More Telugu News