USA: స్కూళ్లు తెరవగానే వైరస్ విజృంభణ... అమెరికాలో మళ్లీ ఆన్ లైన్ బోధన!

  • వందల మంది విద్యార్థులు క్వారంటైన్ లోకి
  • తక్షణం వర్శిటీలను ఖాళీ చేయాలని ఆదేశాలు
  • ఆన్ లైన్ బోధనవైపే మొగ్గు
US Vercities Goes Online Another Time

అమెరికాలో స్కూళ్లు తెరచి, విద్యార్థులు వెళ్లడం ప్రారంభం కాగానే, కేసుల సంఖ్య పెరగడం, వారిలో విద్యార్థుల సంఖ్య వందల్లో ఉండటం, అంతకుమించిన వారిని క్వారంటైన్ చేయాల్సి రావడంతో, మరోసారి ఆన్ లైన్ లో మాత్రమే పాఠాలను చెప్పాలన్న నిర్ణయం వెలువడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్-పర్సన్ టీచింగ్ విధానాన్ని ఆపేసి, అండర్ గ్రాడ్యుయేట్లకు ఆన్ లైన్ క్లాసులు మాత్రమే కొనసాగించాలన్న ఆదేశాలు వెలువడ్డాయని కరోలినాలోని అతిపెద్ద స్కూళ్లలో ఒకటైన చాపెల్ హిల్ లోని ది యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా తెలియజేసింది.

ఇక్కడ సుమారు 30 వేల మంది విద్యార్థులకు క్లాసులు ప్రారంభమైన వారం రోజుల వ్యవధిలోనే 177 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో వారితో కాంటాక్ట్ లో ఉన్న 349 మందిని క్వారంటైన్ చేశారు. విద్యార్థుల్లో ఎంపిక చేసిన కొన్ని వందల మందికి మాత్రమే ర్యాండమ్ గా పరీక్షలు చేయగా, ఈ కేసులు బయటపడ్డాయి. తెరచుకున్న మిగతా స్కూళ్లలోనూ ఇవే పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో విద్యార్థులంతా బుధవారమే క్యాంపస్ లను వీడాలని రిమోట్ టీచింగ్ విధానాన్ని అమలు చేస్తామని మేజర్ పబ్లిక్ యూనివర్శిటీలు వెల్లడించాయి.

"చాలా మంది స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. పూర్తి సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు పాఠాలను నేర్చుకోవాలన్నదే మా అభిమతం" అని యూఎన్సీ-చాపెల్ హిల్ చాన్స్ లర్ కెవిన్ గుస్కివిక్జ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విడుదల అవుతున్న గణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకూ పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.

కాగా, యూఎస్ లోని 100 మేజర్ వర్శిటీలలో, 23 వర్శిటీలు ఇప్పటికే, ఫేస్-టూ-ఫేస్ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించుకోగా, అలబామా, జార్జియా, అయోవా, కెన్టుస్కీ వర్శిటీలు క్లాసులు జరిపిద్దామన్న ఆలోచనలో ఉన్నాయి. తాము క్లాసులను ప్రారంభించిన వారం రోజుల్లో 58 కేసులు రావడంతో క్లాసులను నిలిపివేయాలని యూనివర్శిటీ ఆఫ్ నార్ట్ డామ్ నిర్ణయించింది. ఇదే సమయంలో వర్శిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్లు సైతం వ్యాధి బారిన పడుతూ ఉండటంతో కలవరపడుతున్న వర్శిటీలు, స్కూళ్లను కొంతకాలం తెరవకుండా ఉంటేనే మంచిదన్న ఉద్దేశంలో ఉన్నాయి.

More Telugu News