Kamala Harris: కమలా హారిస్ దైవభక్తి.. అప్పట్లో తన గెలుపును కోరుతూ 108 కొబ్బరికాయలు కొట్టమన్న వైనం!

  • అమెరికా ఉపాధ్యక్షురాలి రేసులోకి దిగి చరిత్ర సృష్టించిన కమల
  • 2010లో కాలిఫోర్నియా అటార్నీ ఎన్నికల్లో పోటీ
  • కొబ్బరికాయలు కొట్టాలంటూ చెన్నైలోని చిన్నమ్మను కోరిన కమల
Newyork times special story on Kamala Harris

అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష రేసులో నిలిచిన కమలా హారిస్‌ (55)కు ఉన్న దైవభక్తికి సంబంధించిన విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించిన కమల.. 2010లో కాలిఫోర్నియా అటార్నీ ఎన్నికల్లో పోటీపడినప్పుడు తన గెలుపును కాంక్షిస్తూ 108 కొబ్బరికాయలు కొట్టాల్సిందిగా తన చిన్నమ్మ సరళా గోపాలన్‌ను కోరినట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కమల వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఆమె భారతీయ కుటుంబం కీలక పాత్ర పోషించిందని అందులో పేర్కొంది.

తమిళ సంప్రదాయ కుటుంబానికి చెందిన కమల తల్లి శ్యామల జమైకాకు చెందిన వ్యక్తిని పెళ్లాడారు. వీరికి కమల, మాయా అనే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత శ్యామల తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నై వచ్చేవారు. అలా చెన్నైతో కమలకు అనుబంధం ఏర్పడింది. అలాగే, తాతయ్య గోపాలన్‌తోనూ ఆమెకు గాఢమైన బంధం ఏర్పడింది.

ఈ సందర్భంగా తాతయ్యను అడిగి హిందూత్వం, భారతీయ సంప్రదాయాల గురించి అడిగి తెలుసుకునేవారు. ఈ క్రమంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై ఉన్న నమ్మకం గురించి 2018 నాటి ప్రసంగంలో కమల స్వయంగా చెప్పుకొచ్చారు. తను అటార్నీ జనరల్‌గా పోటీ పడిన సమయంలో తన గెలుపును కోరుతూ 108 కొబ్బరికాయలు కొట్టాల్సిందిగా చెన్నైలో ఉన్న తన చిన్నమ్మను కోరినట్టు కమల పేర్కొన్నారు.

More Telugu News