Kurnool District: కర్నూలు జిల్లాలో వర్షాలకు 'వజ్రాల' పంట.. ఇప్పటికే 50కి పైగా లభ్యం!

  • వర్షాలు కురుస్తుండటంతో క్యూ కట్టిన ప్రజలు
  • రెండు రోజుల క్రితం మహిళా కూలీకి దొరికిన వజ్రం
  • వజ్రాలను రహస్యంగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
Hunt for Diamonds in Kurnool District

కర్నూలు జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో పొలాలలో వజ్రాలు కూడా విరివిగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా పలు తుగ్గలి మండలంలోని పలు గ్రామాలకు ప్రజలు, ఔత్సాహికులు క్యూ కడుతున్నారు. రోజంతా వజ్రాల కోసం వెతుకులాడుతూ, తమ అదృష్టం ఫలిస్తుందన్న ఆశతో ఉన్నారు. ప్రతి సంవత్సరమూ తొలకరి వర్షాలు కురవగానే, ఇక్కడ విలువైన డైమండ్స్ నేలపైకి వస్తాయన్న సంగతి తెలిసిందే. దీంతో పొలాల్లో రైతులు, కూలీలతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల వారితో పాటు కర్ణాటక నుంచి కూడా వచ్చే ప్రజలు వజ్రాల అన్వేషణలో బిజీగా గడుపుతుంటారు.

ఈ సంవత్సరం ఇప్పటికే 50కి పైగా వజ్రాలు లభించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జొన్నగిరి, పెరవలి తదితర ప్రాంతాల్లోని వజ్రాల వ్యాపారులతో పాటు, గుత్తికి చెందిన వారు రహస్యంగా వీటిని కొంటున్నారు. ఇప్పటివరకూ విక్రయించబడిన వజ్రాల విలువ రూ. 50 లక్షల వరకూ ఉందని తెలుస్తోంది. ఇక వజ్రం లభించిన వారికి, వ్యాపారులు ఆఫర్ చేసిన ధర నచ్చకుంటే, వ్యాపారులంతా టెండర్లు వేస్తారు. ఎక్కువ ఆఫర్ చేసిన వారికి వజ్రం సొంతమవుతుంది. ఈ ప్రక్రియ ఆసాంతం గుంభనంగానే సాగుతుంది. రెండురోజుల క్రితం జొన్నగిరి ప్రాంతంలో ఓ మహిళా కూలీకి విలువైన వజ్రం లభించగా, దాన్ని ఓ వ్యాపారి రూ.6 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొన్నట్టు తెలుస్తోంది.

More Telugu News