Sanjay Raut: వ్యాక్సిన్ ద్వారా రష్యా స్వావలంబన చాటుకుంది... మాటలు తప్ప మీరేం సాధించారు?: కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్

Sanjay Raut questions centre where is Aatmanirbhar
  • ఇటీవలే కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చిన రష్యా
  • పుతిన్ ను కొనియాడిన సంజయ్ రౌత్
  • ప్రచారం తప్ప భారత్ లో ఆత్మనిర్భర్ కనిపించడంలేదన్న రౌత్
ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ను రూపొందించడం ద్వారా రష్యా స్వావలంబన చాటుకుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివరించారు. కానీ మన దేశంలో ఆత్మనిర్భర్ అంటూ మాటలు చెప్పడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. రష్యా వ్యాక్సిన్ ఏమాత్రం నమ్మదగింది కాదని ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమైతే, తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ డోసు ఇచ్చి దేశంలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కొనియాడారు.

ఆత్మనిర్భర్ అంటే ఏమిటో రష్యా ప్రపంచానికి తొలిపాఠం నేర్పిందని పేర్కొన్నారు. మనం మాత్రం ఆత్మనిర్భర్ గురించి ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం అంటూ మండిపడ్డారు. అంతేకాదు, అయోధ్య రామమందిరం ట్రస్ట్ అధినేత మహంత్ నృత్యగోపాల్ దాస్ కరోనా బారినపడ్డారని, ఆయనతో చేయి కలిపిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్వారంటైన్ లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sanjay Raut
Aatmanirbhar Bharat
Vaccine
Russia
Narendra Modi

More Telugu News