Rahul Gandhi: ఫేస్ బుక్ ను బీజేపీ నియంత్రిస్తోందన్న రాహుల్... ఓడిపోయిన వాళ్లు ఇలాగే నసుగుతుంటారన్న కేంద్రమంత్రి

  • కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
  • విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారన్న రాహుల్
  • పైత్యం తలకెక్కిందా? అంటూ రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు
War of words between Rahul Gandhi and Ravi Shankar Prasad

బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. దేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. వాటి ద్వారా ఫేక్ న్యూస్, విద్వేషపూరిత భావజాలం వ్యాప్తి చేస్తున్నారని, ఈ మాధ్యమాల ద్వారా ఓటర్లను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. చివరికి ఫేస్ బుక్ బండారం అమెరికా మీడియా బయటపెట్టిందని రాహుల్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా విద్వేష వ్యాఖ్యలపై ఫేస్ బుక్ నిబంధనలు భారత్ లో ఎలా నీరుగారిపోతున్నాయో అమెరికా మీడియాలో వచ్చిన కథనాన్ని కూడా రాహుల్ తన ట్వీట్ లో పొందుపరిచారు.

కాగా, రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అదేస్థాయిలో స్పందించారు. కనీసం తమ సొంత అభిప్రాయాలతోనైనా ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేయలేని పరాజితులు ఇలాగే నసుగుతూ ఉంటారని, యావత్ ప్రపంచాన్ని కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే నియంత్రిస్తున్నాయని గగ్గోలు పెడుతుంటారని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. "ఎన్నికల ముందు డేటాను అస్త్రంగా వాడుకునే ప్రయత్నంలో కేంబ్రిడ్జ్ ఎనలిటికా-ఫేస్ బుక్ లతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికపోయావు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించేంతగా పైత్యం తలకెక్కిందా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News