Parliament: త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు... కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ చూడని ఏర్పాట్లు

Preparations underway for parliament monsoon sessions amidst corona spreading
  • ఆగస్టు చివర్లో లేక సెప్టెంబరు మొదట్లో సమావేశాలు ప్రారంభం
  • కరోనా వ్యాప్తి దృష్ట్యా సీటింగ్ లో భారీ మార్పులు
  • చాంబర్లు, గ్యాలరీల్లో భారీ టెలివిజన్ తెరలు
ఓవైపు కరోనా రక్కసి అతలాకుతలం చేస్తున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు చివరి వారం కానీ, సెప్టెంబరు మొదటివారంలో కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో లోక్ సభ, రాజ్యసభల సీటింగ్ స్వరూపాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా భౌతిక దూరం నిబంధనను విధిగా పాటించాల్సి ఉండడంతో ఈసారి పార్లమెంటు సమావేశాలు కొత్తగా జరగనున్నాయి.

1952 తర్వాత పార్లమెంటు చరిత్రలో సీటింగ్ ఏర్పాట్లు జరగడం ఇదే ప్రథమం. రాజ్యసభలో 60 మంది సభ్యులు చాంబర్ లో, 51 మంది సభ్యులు గ్యాలరీలో ఆసీనులవుతారు. మిగతా 132 మందికి లోక్ సభ చాంబర్ లో సీటింగ్ ఏర్పాటు చేశారు. లోక్ సభలోనూ ఇలాంటి ఏర్పాట్లే కనిపించనున్నాయి. ఈ ఏర్పాట్ల కోసం చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17నే సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్యనాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 3వ వారం నాటికి ఏర్పాట్లు పూర్తవ్వాలని తెలిపారు.

కాగా, ఈసారి సమావేశాల కోసం చాంబర్లలో ఒక్కోటి 85 అంగుళాల నాలుగు పెద్ద టెలివిజన్ స్క్రీన్లు, 40 అంగుళాల 6 టెలివిజన్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, నాలుగు గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Parliament
Monsoon Session
Lok Sabha
Rajya Sabha
Corona Virus

More Telugu News