అమెరికా స్వప్నంపై ఆశలు వదులుకుంటున్న భారతీయులు... కెనడా వైపు పయనం!

16-08-2020 Sun 17:10
  • అమెరికాలో గ్రీన్ కార్డు నిబంధనలు కఠినం
  • శాశ్వత నివాసం కోసం ఏళ్ల తరబడి వేచి చూసే పరిస్థితి
  • సరళతర విధానాలతో స్వాగతం పలుకుతున్న కెనడా
Indians green card dream almost brinks as they eyes on Canada
భారతీయులు అమెరికా వెళ్లి, అక్కడే మంచి ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడడం అనేది ఓ మధుర స్వప్నం! కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక అక్కడి ఇమ్మిగ్రేషన్ విధానంలో తీవ్ర మార్పులు వచ్చాయి. అమెరికాలో శాశ్వత నివాసానికి ఉపయోగపడే గ్రీన్ కార్డులు పొందడం ఇక ఎంతో కష్టం అనే స్థాయికి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా, ఐటీ బూమ్ వచ్చిన తర్వాత అమెరికాకు పోటెత్తిన భారతీయులు ఇటీవల కాలంలో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు నెలలు, సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ట్రంప్ సారథ్యంలో అమెరికా చట్టాలు ఆ విధంగా కఠిన రూపు దాల్చాయి.

ఈ నేపథ్యంలో, భారతీయులకు మరో సుందర స్వప్నం రారమ్మంటోంది. అమెరికా పొరుగునే ఉన్న కెనడా మనవాళ్లకు స్వర్గద్వారాలు తెరుస్తోంది. తాజా అంచనాల ప్రకారం గత కొన్నేళ్లుగా కనీసం 20 వేల మంది భారతీయులు ఏటా అమెరికా నుంచి కెనడాకు మకాం మార్చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీనిపై హైదరాబాద్ కు చెందిన దినేశ్ దాసరి అనే యువకుడు స్పందిస్తూ, తాను అమెరికాలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆరు సార్లు హెచ్1బీ వీసా పొడిగింపు జరిగిందని, కానీ శాశ్వత నివాసం ఇప్పటికీ సాధ్యపడకపోవడంతో జూలై నెలలో మేరీలాండ్ నుంచి కెనడాలోని టొరంటో వెళ్లిపోయానని తెలిపారు. 14 ఏళ్లు అమెరికాలో కష్టపడినా ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు. గ్రీన్ కార్డ్ జారీకి జరిగిన ఆలస్యంతో కెరీర్ పరంగా ఎంతో నష్టపోయానని, ఎదుగుబొదుగు లేకుండా పోయిందని వివరించాడు.

"మన గ్రీన్ కార్డు దరఖాస్తు మనకు ఉద్యోగమిచ్చిన సంస్థతో ముడిపడి ఉండడంతో ఇతర సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలకు మారడం చాలా కష్టమవుతోంది" అంటూ విచారం వ్యక్తం చేశాడు. మేనేజర్ తరహా ఉద్యోగాలకు వెళదామనుకున్నా దేశంలో స్థిరనివాసం లేని వ్యక్తులపై ఏమంత సానుకూలత కనిపించదని దినేశ్ వెల్లడించాడు.

ఇది ఒక్క దినేశ్ కు చెందిన సమస్య మాత్రమే కాదు. అమెరికాలో దాదాపుగా 9 లక్షల మంది హెచ్1బీ, హెచ్4 ఈఏడీ, ఎల్1 వీసాదారులు ఉన్నారు. వీరిలో చాలామంది దృష్టి కెనడాపై పడింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలతో పోలిస్తే కెనడా ఇమ్మిగ్రేషన్ ఎంతో సరళంగా ఉండడం భారతీయ నిపుణులను ఆకర్షిస్తోంది.

కెనడాలో ఇమ్మిగ్రేషన్ అధికారులతో ఏదైనా అంశంపై స్పష్టంగా వ్యక్తీకరించే అవకాశం ఉంటుందని, అమెరికా వ్యవస్థలో ఆ అవకాశమే ఉండదని గిరీశ్ చవాన్ అనే ఐటీ నిపుణుడు పేర్కొన్నాడు. చవాన్ కూడా పిట్స్ బర్గ్ నుంచి టొరంటో వెళ్లిపోయాడు. కెనడాలో తమకు ఘనస్వాగతం లభించడమే కాకుండా, ఏ ఉద్యోగంలో చేరాలో నిర్ణయించుకునేందుకు అపారమైన స్వేచ్ఛ కూడా ఉంటుందని చవాన్, దినేశ్ వెల్లడించారు.