Science Advanced: వ్యాక్సిన్ అవసరం లేకుండానే... కరోనాను ఖతం చేసే ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు!

Ebselen is New Potencial Drug for Corona
  • వైరస్ పునరుత్పత్తిని అడ్డుకుంటున్న ఎబ్సెలీన్
  • ఇప్పటికే పలు రుగ్మతలకు నివారణగా వినియోగంలో
  • వెల్లడించిన చికాగో వర్శిటీ రీసెర్చర్లు
  • సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో అధ్యయన ఫలితాలు
కరోనా సోకకుండా టీకాను కనుగొనేందుకు ఎన్నో దేశాలు తలమునకలై ఉన్న వేళ, కరోనా సోకిన వారి శరీరంలో నుంచి వైరస్ ను పారద్రోలే ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన కంప్యూటర్ సిములేషన్స్ ను వినియోగించి, ఇప్పటికే అందుబాటులో ఉన్న 'ఎబ్సెలీన్' కరోనా శరీరంలో పునరుత్పత్తి కాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తేల్చారు. ఈ ఔషధాన్ని ఇప్పటికే పలు రకాల రుగ్మతలకు వినియోగిస్తున్నారు. ఇది యాంటీ వైరల్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడేటివ్ గా, బ్యాక్టీరిసైడల్ గా శరీరంలోని కణజాలాన్ని కాపాడేదిగా గుర్తింపు తెచ్చుకుంది. వినికిడి సమస్యలు ఉన్నవారితో పాటు, బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వారికి ఇస్తున్నారు.

శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలను 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్ లో ప్రచురించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో రీసెర్చర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, వైరస్ ఆర్ఎన్ఏ జన్యువుల్లో ఎంప్రో ప్రొటీన్లను తయారు చేయడం ద్వారా, అది ఆశ్రయించుకుని ఉన్న శరీరంలోని కణజాలంలో మరో వైరస్ ను పుట్టిస్తోంది. వేలాది బయొలాజికల్ మాలిక్యూల్స్ మోడల్స్ ను వినియోగించి, శాస్త్రవేత్తలు, వైరస్ కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ వైరల్ మెటీరియల్ ను గుర్తించారు. వైరస్ లోని ఎంప్రోను నివారించే ఆయుధంగా ఎబ్సెలీన్ పనిచేస్తుందని అధ్యయనానికి కో-ఆథర్ గా పనిచేసిన చికాగో వర్శిటీ ప్రొఫెసర్ జువాన్ డీ పాబ్లో వ్యాఖ్యానించారు.

తమ అధ్యయనంలో భాగంగా ఎంజైమ్ మోడల్స్ ను అభివృద్ధి చేశామని, ఎబ్సెలీన్, రెండు విభిన్న మార్గాల ద్వారా ఎంప్రో యాక్టివిటీని తగ్గిస్తుందని గుర్తించామని తెలిపారు. దీంతో కరోనాను నమ్మకంగా నాశనం చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులోనే ఎబ్సెలీన్ కొత్త ఔషధంగా కరోనాపై విరివిగా వినియోగంలోకి వస్తుందని అన్నారు.
Science Advanced
Ebselin
Corona Virus

More Telugu News