థార్... మహీంద్రా నుంచి సరికొత్త వాహనం

15-08-2020 Sat 17:08
  • ఆఫ్ రోడ్ వాహనాన్ని ఆవిష్కరించిన మహీంద్రా అండ్ మహీంద్రా
  • అక్టోబరు 2న మార్కెట్లోకి రానున్న ఎస్ యూవీ
  • భద్రతకు పెద్దపీట
Mahindra and Mahindra launches all new off road vehicle Thar

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ నుంచి సాలిడ్ లుక్ తో సరికొత్త వాహనం వచ్చింది. లుక్స్ పరంగా ఆఫ్ రోడ్ అడ్వెంచర్లకు అనుకూలంగా కనిపిస్తున్న ఈ వాహనం పేరు థార్. మహీంద్రా సంస్థ అభివృద్ధి చేసిన ఈ నయా ఎస్ యూవీ థార్ అక్టోబరు 2న మార్కెట్లోకి రానుంది. సరిగ్గా అదే రోజున సంస్థ వ్యవస్థాపక దినోత్సవం కావడం విశేషం. సాఫ్ట్ టాప్, హార్డ్ టాప్ వెర్షన్లతో ఇది మార్కెట్లోకి రానుంది.

థార్ లో ముఖ్యంగా గమనించాల్సింది ఇంటీరియర్స్. సీటింగ్ ఎంతో రిచ్ గా ఉంది. స్పోర్టీ ఫ్రంట్ సీట్స్, రిక్లైనబుల్ బ్యాక్ సీట్స్ తో ఎంతో పొందికగా కనిపిస్తోంది. వినోదం కోసం రూఫ్ మౌంటెడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీసెల్ వెర్షన్లలో లభించే థార్ లో 6 స్పీడ్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఇది అన్ని రకాల నేలలపైనా ప్రయాణించగలదని మహీంద్రా పేర్కొంది. యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థలు, ఎయిర్ బ్యాగులతో భద్రతకు పెద్దపీట వేశారు. ఇక దీని ఆన్ రోడ్ ధర రూ.9.6 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి.