KCR: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం.... సీఎం ఆదేశాలతో రెండు హెలికాప్టర్లు సిద్ధం

  • రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు
  • పొంగిపొర్లుతున్న చెరువులు
  • అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
Heavy rains lashes Telangana state and CM KCR reviewed the situation

ఓవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా మారడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరింది.  రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహించారు.

చెరువులకు గండ్లు పడే పరిస్థితి ఏర్పడిందని, తద్వారా రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రులతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రులు జిల్లాల్లోనే ఉండి, కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవడంతో చెరువులు ప్రమాదకర స్థితికి చేరాయని, ఈ రెండు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

అంతేగాకుండా, వరదలు సంభవిస్తే ప్రజలను కాపాడేందుకు రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి ఒక ప్రభుత్వ హెలికాప్టర్ ను, మరొక సైనిక హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాదు, సిద్ధిపేట జిల్లా బస్వాపూర్ లో వరద నీటిలో చిక్కుకున్న లారీ సిబ్బందిలో ఒకరిని హెలికాప్టర్ సాయంతో కాపాడారు. కానీ మోతె వాగులో కొట్టుకుపోయిన లారీ డ్రైవర్ శంకర్ మృతి చెందాడు.


More Telugu News