Bandla Ganesh: సోనూ సూద్ బాటలో బండ్ల గణేశ్... అడిగినవాళ్లకు ఉపాధి కల్పన!

Bandla Ganesh responds to requests in social media
  • కాదనకుండా సాయపడుతూ గుర్తింపు పొందుతున్న సోనూ సూద్
  • సోషల్ మీడియాలో విజ్ఞప్తులకు స్పందిస్తున్న బండ్ల గణేశ్
  • సాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం
సాయం చేయాలంటూ చిన్న ట్వీట్ ద్వారా సమాచారం పంపితే చాలు... నేనున్నానంటూ భరోసా ఇస్తూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా సోనూ సూద్ బాటలోనే నడుస్తున్నాడు. తనను సాయం అడిగినవాళ్లకు లేదనకుండా ఏదో ఒక మార్గం చూపిస్తున్నారు. తాజాగా మణికాంత్ అనే కుర్రాడు ఇంటర్ చదివానని, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఉద్యోగం చేయాలనుకుంటున్నానని బండ్ల గణేశ్ కు ట్వీట్ చేశాడు. తనకు డబ్బులు అక్కర్లేదని ఉద్యోగం చూపిస్తే చాలని అర్థించాడు. దీనిపై స్పందించిన బండ్ల గణేశ్ ఓ సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ తన పేరు చెబితే ఉద్యోగం ఇస్తారని హామీ ఇచ్చారు.

మరో యువకుడు తాను ఎంబీఏ ఫైనాన్స్ చదివి ఖాళీగా ఉన్నానని ట్వీట్ చేస్తే, తనకు తెలిసినవాళ్ల వద్ద ఉద్యోగం ఉందని ఆ యువకుడికి ఫోన్ నెంబర్ ఇచ్చారు. అంతేకాకుండా, ఓ మీడియా రిపోర్టర్ తనకు కరోనా సోకిందని, ఫోన్ పే ద్వారా సాయం చేయాలని కోరితే దానికి కూడా స్పందించిన బండ్ల గణేశ్ కొంతమేర ఆర్థికసాయం అందించారు. ఓ యువకుడు నిరుద్యోగం కారణంగా నిస్పృహ చెంది కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడితే బండ్ల గణేశ్ అతడ్ని వారించి, విద్యార్హతల వివరాలు  పంపితే పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు.
Bandla Ganesh
Help
Needy
Sonu Sood

More Telugu News