Mojambic: మొజాంబిక్ సైన్యంపై ఐసిస్ ఉగ్రవాదుల విజయం!

  • కీలకమైన మెసిమ్ బోవా పోర్టు స్వాధీనం
  • పక్కనే భారీ ఎత్తున సహజవాయు నిక్షేపాలు
  • కొంతకాలంగా ఉగ్రవాదులతో సైన్యం పోరాటం
  • సైన్యం వద్ద ఆయుధాల కొరత గమనించి ఐసిస్ దాడి
IS Terrorists Capture Mojambic Port

ఆఫ్రికాలో అత్యంత కీలకమైన నౌకాశ్రయాల్లో ఒకటైన మొజాంబిక్ లోని పోర్ట్ ఆఫ్ మెసిమ్ బోవాను ఐసిస్ ఉగ్రవాదులు తమ అధీనంలోకి తీసుకోవడం పెను సంచలనమైంది. ఇక్కడికి దగ్గర్లోనే సుమారు 60 బిలియన్ డాలర్ల విలువైన సహజవాయు నిక్షేపాలు ఉండటంతో, దానిపై కన్నేసిన ఉగ్రవాదులు, ఈ పోర్టు కోసం మొజాంబిక్ భద్రతా దళం ఎఫ్డీఎస్ తో కొన్నేళ్లుగా భీకర పోరు సాగిస్తున్నారు.

స్థానిక ప్రజలను కవచంగా మార్చుకుని ఉగ్రవాదులు పోరు సాగించగా, వారిని ఏరివేసేందుకు భద్రతా దళాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పోరాటంలో భారీ ఎత్తున సైనికులు మరణించగా, నౌకాశ్రయం ప్రభుత్వం చేతుల నుంచి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది.

కాగా, పోర్టుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంగా ఉన్న గ్యాస్ ఫీల్డ్ ను ఫ్రాన్స్ కు చెందిన టోటల్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈ పోర్టు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తూ వచ్చిన ఉగ్రవాదులు, పోర్టు కోసం గతంలోనూ పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. ఇంతకాలమూ మొజాంబిక్ సైన్యం వారిని అడ్డుకుంటూ వచ్చింది.

తాజాగా భద్రతాదళాల వద్ద ఆయుధాల కొరత ఏర్పడిందని పసిగట్టిన ఉగ్రవాదులు, ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ పోరులో 59 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది. కీలకమైన పోర్టును స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులు, ఇక చమురు క్షేత్రంవైపు రావచ్చన్న ఆందోళన నెలకొంది. అప్పట్లో సిరియాలోని ఆయిల్ ఫీల్డ్ లను తమ అధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు వాటి సాయంతో భారీగా డబ్బు సంపాదించారు. ఇప్పుడు మొజాంబిక్ లోనూ ఉగ్రవాదులు అదే ఆలోచనలో ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News