శ్రీనగర్ లో పోలీసుల బృందంపై ఉగ్రవాదుల దాడి!

14-08-2020 Fri 10:46
  • నౌగామ్ సమీపంలో ఘటన
  • చికిత్స పొందుతూ మరణించిన ఇద్దరు పోలీసులు
  • ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్
terrorists Attack on Police Near Srinagar
శ్రీనగర్ శివార్లలో ఈ ఉదయం ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పోలీసుల బృందం వెళుతున్న కాన్వాయ్ పై దాడి చేశారు. నౌగామ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో జమ్మూ కశ్మీర్ కు చెందిన ఇద్దరు పోలీసులు మరణించారని, తీవ్ర గాయాలపాలైన మరొకరికి చికిత్స జరుగుతోందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

బైపాస్ రహదారిలో కాన్వాయ్ వెళుతుండగా, ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారని, గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరు చికిత్స పొందుతూ అమరులయ్యారని పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని అదనపు బలగాలు చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ప్రారంభించాయని తెలిపారు.

కాగా, మరికొన్ని గంటల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చంటూ ముందుగానే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నిత్యమూ హై అలర్ట్ లో ఉండే ప్రాంతంలో దాడి జరగడం గమనార్హం.