Sachin Pilot: సచిన్ పైలట్ తిరిగొచ్చిన వేళ... బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేసిన అశోక్ గెహ్లాట్!

  • విశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డ రాజస్థాన్ సీఎం
  • సచిన్ పైలట్ తో సమావేశం తరువాత నిర్ణయం
  • విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న పైలట్
Ashok Gehlot Confidence Motion in Rajasthan Assembly

రాజస్థాన్ ప్రభుత్వంలో గత నెలలో ఏర్పడిన పెను సంక్షోభం, టీ కప్పులో తుపానులా మారిపోయిన వేళ, బీజేపీ వేసిన ఎత్తునకు అశోక్ గెహ్లాట్ ఇప్పుడు పైఎత్తు వేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. గెహ్లాట్ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నామని విపక్ష బీజేపీ స్పష్టం చేసిన వేళ, అంతవరకూ వెళ్లకుండా, తానే విశ్వాస తీర్మానానికి వెళ్లాలని భావిస్తోంది. ఇందుకోసం నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలనే వేదికగా చేసుకోవాలని, సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు. నిన్న సచిన్ పైలట్ తో సమావేశమైన తరువాత, ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం విశ్వాస తీర్మానాన్ని సీఎం కాకుండా మిగతా సభ్యుడెవరైనా ప్రతిపాదించాల్సి వుండటంతో దాన్ని సచిన్ పైలట్ చేతనే ప్రతిపాదించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. తద్వారా 200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో తనకు 102 కన్నా ఎక్కువ మంది సభ్యులున్నారని నిరూపించడమే ఆయన ఉద్దేశమని సమాచారం.

ఇదే జరిగితే, మరో ఆరు నెలల పాటు బీజేపీ, రాష్ట్రంలో గెహ్లాట్ సర్కారును పడగొట్టడానికి ఎటువంటి వీలూ ఉండదు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం గెహ్లాట్ ప్రభుత్వానికి 125 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత నెలలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఈ బలం 100 దిగువకు వస్తుందని భావించినప్పటికీ, సచిన్ తిరిగి రావడంతో పూర్తి స్థాయిలో గెహ్లాట్ సర్కారు తిరిగి పుంజుకున్నట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, బీజేపీకి ప్రస్తుతం 72 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైనంత బలం ఆ పార్టీకి ఉన్నప్పటికీ, అవిశ్వాస తీర్మానం కోసం ముందడుగు వేస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో భంగపాటు తప్పదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News