Hyderabad: హైదరాబాద్ ను కమ్మేసిన మేఘాలు... పలు చోట్ల రాత్రి నుంచి వర్షం!

  • పలు ప్రాంతాల్లో రోడ్లపైకి చేరిన నీరు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
  • ఇతర ప్రాంతాలు, కోస్తాంధ్రలోనూ వర్షాలు
Rain in Hyderabad and Telangana

ఉపరితల ఆవర్తనానికి తోడు, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఓ మోస్తరు వర్షం పడిన ప్రాంతాల్లో ఈ ఉదయం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నగరంలోని ఎల్బీ నగర్, రామాంతపూర్, ఖైరతాబాద్, మాదాపూర్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, హయత్ నగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

తెలంగాణలోని ఇతర జిల్లాల్లో సైతం చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మెదక్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

More Telugu News