Corona Virus: రష్యా ధోరణి ప్రమాదకరం... రెండు నెలల్లో వ్యాక్సిన్ తీసుకురావడంపై నిపుణుల అనుమానాలు!

Experts doubts Russina vaccine for Corona prevention
  • వ్యాక్సిన్ సిద్ధం అంటూ ప్రకటించిన రష్యా అధ్యక్షుడు
  • దుష్ఫలితాలు తప్పవంటున్న నిపుణులు
  • ప్రయోగ సమాచారం అందించకపోవడంపై సందేహాలు
రష్యాకు చెందిన గమాలేయా ఇన్ స్టిట్యూట్, రక్షణ శాఖతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, జర్మనీ, బ్రిటన్ నిపుణులు రష్యా వ్యాక్సిన్ పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు నెలల్లో వ్యాక్సిన్ తీసుకురావడం ఎంతో ప్రమాదకరం అని, ఎంతో కీలకమైన ప్రయోగాలను హడావుడిగా జరుపడం రష్యా నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. సర్వం సిద్ధమైనట్టుగా చెబుతున్న వ్యాక్సిన్ గురించి ఎక్కడ, ఎలాంటి ప్రయోగాలు నిర్వహించారో ఆ సమాచారం వెల్లడించకపోవడం అనుమానాలు కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.

లండన్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన యూనివర్సిటీ కళాశాల నిపుణులు దీనిపై స్పందిస్తూ, అసంపూర్ణంగా ప్రయోగాలు జరిపిన వ్యాక్సిన్ ను పెద్ద సంఖ్యలో ప్రజలకు అందించడం సరికాదన్నారు. ఇలాంటి తొందరపాటు వ్యాక్సిన్ లతో దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన మూర్ఖత్వంతో కూడుకున్నదని విమర్శించారు. కాలక్రమంలో ఇలాంటి వ్యాక్సిన్ లపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వివరించారు.

జర్మనీ నిపుణులు కూడా ఇలాంటి అభిప్రాయాలే వెల్లడించారు. వేలమందిపై ప్రయోగాలు నిర్వహించి, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ను హడావుడిగా ఆమోదించడం రష్యా ప్రమాదకర వైఖరికి నిదర్శనం అని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ వ్యాక్సిన్ ప్రధానంగా అడినో వైరస్, కరోనా వైరస్ మృతకణాల ఆధారంగా రూపొందించినట్టు రష్యా ప్రభుత్వం చెబుతోంది. అందువలన తమ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కరోనా కణాలు రెట్టింపయ్యే ప్రసక్తే లేదని అంటోంది.
Corona Virus
Vaccine
Russia
Germany
Britain

More Telugu News