NSUI: పీపీఈ కిట్లు ధరించి.. ఒక్కసారిగా దూసుకువచ్చిన ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు... ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత...

NSUI cadre wearing PPE Kits protests at Pragathi Bhavan
  • ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సర్కారు
  • వాయిదా వేయాలన్న ఎన్ఎస్ యూఐ
  • ఎన్ఎస్ యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రగతిభవన్ ను ముట్టడించారు. పరీక్షలపై పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు ఎంట్రన్సు టెస్టుల నిర్వహణకు ప్రయత్నిస్తోందంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పీపీఈ కిట్లు ధరించి ప్రగతిభవన్ వద్దకు ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఎన్ఎస్ యూఐ పతాకాలను చేబూనిన వారు లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ దశలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పలువురు ఎన్ఎస్ యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎన్ఎస్ యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కరోనా టెస్టులపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

NSUI
PPE Kits
Prgathi Bhavan
Entrance Tests
Schedule

More Telugu News