Police: బెంగళూరులో జరిగింది మామూలు హింసకాదు.. ఘర్షణల్లో 3,000 మంది పాల్గొన్నారు: పోలీసుల వివరణ

  • హింస వెనుక భారీ కుట్ర  
  • ఈ నెల 5 నుంచి ప్రణాళిక
  • డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం
  • ఏ1గా ఎస్‌డీపీఐ నేత ముజామ్మిల్‌ బాషా
police on bangalore riots

కర్ణాటక రాజధాని బెంగళూరులోని డీజేహళ్లి, కేజీహళ్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిన్న రాత్రి హింసాత్మక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో జరిగిన భారీ విధ్వంసం గురించి వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న రాత్రి చోటు చేసుకున్న ఈ హింస అప్పటికప్పుడు అనుకుని చేసింది కాదని, దీని వెనుక భారీ ప్రణాళిక ఉందని పోలీసులు తేల్చారు.

ఈ నెల 5 నుంచి కుట్రకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆందోళనల సమయంలో కొంతమంది గంజాయి తాగి ఉన్నట్లు తేల్చారు. ఈ ఘర్షణల్లో దాదాపు 3000 మంది పాల్గొన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లు తెలిపారు.

అల్లర్ల వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌డీపీఐ నేత ముజామ్మిల్‌ బాషాను ఏ1గా పేర్కొన్నారు. ఉద్రిక్త పరిస్థితులతో ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద అదనపు భద్రతను మోహరింపజేశారు.

ఈ ఘటనపై గవర్నర్‌కు హోంమంత్రి బసవరాజ బొమ్మై వివరణ ఇచ్చారు. అలాగే, సీఎం యడియూరప్పకు డీజీపీ ప్రవీణ్ సూద్ నివేదిక అందజేశారు. బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  బెంగళూరులోని పరిస్థితులను సీఎం యడియూరప్ప సమీక్షించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

More Telugu News