Corona Virus: కరోనా హోం ఐసొలేషన్ రూల్స్ మార్చిన కర్ణాటక..  కొత్త నిబంధనలు ఇవిగో!

  • అసింప్టొమేటిక్ లేదా తక్కువ లక్షణాలు ఉంటేనే హోం ఐసొలేషన్ 
  • తొలుత బాధితుడి ఇంటిని పరిశీలించనున్న వైద్య సిబ్బంది
  • ప్రతి రోజు ఫోన్ ద్వారా బాధితుడి పరిస్థితిపై సమీక్ష
Karnataka brings new rules for Covid home isolation

కర్ణాటకలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రులు పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హోం ఐసొలేషన్ నిబంధనలను కర్ణాటక ప్రభుత్వం మార్చింది. కొత్త నిబంధనలను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం అసింప్టొమేటిక్ (అసలు లక్షణాలు లేకపోవడం) లేదా తక్కువ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే హోం కేర్ కు అనుమతిస్తారు. జిల్లా ఆరోగ్య సిబ్బంది లేదా అనుమతులు పొందిన ప్రైవేట్ సంస్థ సిబ్బంది తొలుత బాధితుడి ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. హోం ఐసొలేషన్ కు ఆ ఇల్లు సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని వారు అంచనా వేస్తారు. అనంతరం బాధితుడికి చికిత్స అందిస్తారు.

హోం ఐసొలేషన్ లో ఉన్నంత కాలం ప్రతి రోజు టెలిఫోన్ ద్వారా బాధితుడి పరిస్థితిని అధికారులు తెలుసుకుంటారు. ఐసొలేషన్ లో ఉన్నంత కాలం 24 గంటల పాటు ఫోన్ ద్వారా వైద్య సిబ్బందిని సంప్రదించే వెసులుబాటు వారికి ఉంటుంది.

60 ఏళ్లు దాటిన వారు బీపీ, డయాబెటిస్, గుండె సంబంధిత ఇబ్బందులు, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు తదితర వ్యాధులతో బాధపడుతున్నట్టయితే... వారికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించిన తర్వాతే... వారిని హోం ఐసొలేషన్ కు అనుమతిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేనట్టైతే కరోనా సెంటర్ కు తరలిస్తారు. మరో రెండు వారాల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉన్న గర్భిణిలను హోం ఐసొలేషన్ కు అనుమతించరు.  

కరోనా వేస్ట్ కు సంబంధించి కూడా కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. హోం ఐసొలేషన్ లో ఉన్న వారికి సంబంధించిన మాస్కులు, గ్లవ్స్, టాయిలెట్ వస్తువులు, స్వాబ్స్, బాడీ ఫ్లూయిడ్స్, సిరంజిలు తదితర వస్తువులను బయోమెడికల్ వేస్ట్ గా భావిస్తారు. వీటిని ఎల్లో బ్యాగ్ లో ప్రత్యేకంగా కలెక్ట్ చేస్తారు. ఐసొలేషన్ లో ఉన్న బాధితుడికి కేర్ టేకర్ గా ఉన్న కుటుంబసభ్యులు ఉపయోగించిన మాస్కులు, గ్లవ్స్ ను ఒక పేపర్ బ్యాగ్ లో సేకరించి కనీసం 72 గంటల పాటు ఒక పేపర్ బ్యాగ్ లో ఉంచుతారు. ఆ తర్వాత వాటిని రీయూజ్ చేయకుండా ముక్కలు చేస్తారు.

More Telugu News