Chandrababu: 13 జిల్లాలకు మేమేం చేశామో చెబుతున్నాం, 14 నెలల్లో మీరేం చేశారో చెప్పగలరా?: వైసీపీని సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు

TDP Chief Chandrababu asks government show what you have did to any district
  • మరోసారి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు
  • ఏది నిజమో ప్రజలు గుర్తించాలని పిలుపు
  • నిజమైన అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచన
ఏపీకి మూడు రాజధానులు అంటూ సర్కారు చట్టాలు చేసినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ తమ వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అభివృద్ధి అంశంపై సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించారు. తాము చేసిన అభివృద్ధి గురించి వివరించి, వైసీపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్నామని, రాష్ట్రానికి రాజధాని కూడా లేదని, చెప్పుకోదగ్గ నగరం లేదని, పరిశ్రమలు లేవని తెలిపారు. సైబరాబాద్ తరహాలో నాలెడ్జ్ ఎకానమీ మోడల్ ను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచించామని వెల్లడించారు. ముఖ్యంగా పోర్టు ఆధారిత పరిశ్రమలను ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో మొదట గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను అభివృద్ధి చేశానని, ఆ తర్వాత రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టులకు నాంది పలికామని తెలిపారు.

ఏపీకి ఉన్న పెద్ద వనరు గోదావరి నది అని, దీన్నుంచి అత్యధిక పరిణామంలో మిగులు జలాలు సముద్రంలోకి వెళుతున్నాయని, ఈ మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టామని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో చారిత్రాత్మక రీతిలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని వివరించారు. 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేశామని, సముద్రంలోకి వృథాగా పోయే నీటిని రాయలసీమ, ఉత్తరాంధ్రకు తరలించామని పేర్కొన్నారు. ఈ దిశగా రూ.64 వేల కోట్ల మేర ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు.

పరిశ్రమలు వస్తే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో, పెద్ద ఎత్తున పెట్టుబడులకు శ్రీకారం చుట్టామని, పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ-ఏపీ భాగస్వామ్యంతో విశాఖలో సదస్సులు నిర్వహించామని వెల్లడించారు. ఈ ఐదేళ్లలో సుమారు రూ.16 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నామని, ఒప్పందాలన్నీ సాకారమైతే 32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు.

కరవు జిల్లాగా పేరొందిన అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకువచ్చామని, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ అక్కడే ఏర్పాటైందని, ఎనర్జీ యూనివర్సిటీ కూడా అక్కడే ఏర్పాటు కానుందని తెలిపారు. హంద్రీ-నీవాకు ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. రహదారులు, విద్యుత్ సహా అనేక రంగాల్లో సమస్యలు అధిగమించామని, సమగ్రాభివృద్ధికి నాంది పలికినట్టు చెప్పారు.

ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ప్రజలు గ్రహించాలని, ఏది నిజమైన అభివృద్ధి, ఏది విధ్వంసమో ప్రజలు గుర్తించాలని కోరారు. 13 జిల్లాల అభివృద్ధికి తామేం చేశామో చెబుతున్నామని, గత 14 నెలల్లో ఏ జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Chandrababu
Development
Districts
YSRCP
Andhra Pradesh

More Telugu News