Patanjali Group: ఐపీఎల్ స్పాన్సర్ రేసులో బాబా రాందేవ్ పతంజలి గ్రూపు!

  • ఐపీఎల్ స్పాన్సర్ గా వైదొలగిన చైనా సంస్థ వివో
  • రేసులో అమెజాన్, జియో, టాటా గ్రూప్, బైజు
  • బీసీసీఐకి ప్రతిపాదనలు పంపుతున్నట్టు పతంజలి వెల్లడి
Patanjali group considers to bid for IPL sponsorship

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చైనాకు చెందిన వివో సంస్థ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దాంతో ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ ద్వారాలు తెరిచింది. విశేషమైన బ్రాండ్ నేమ్ ఉన్న ఐపీఎల్ ను స్పాన్సర్ చేయడం ద్వారా తమ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుకోవాలని బడా కంపెనీలు తలపోస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, జియో, టాటా గ్రూప్, డ్రీమ్ 11, అదానీ గ్రూప్, బైజు యాప్ రేసులో ఉన్నాయి. తాజాగా, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి గ్రూపు కూడా ఈ పోటీలో అడుగుపెట్టింది.

ఈ ఏడాది ఐపీఎల్ ను స్పాన్సర్ చేసే అవకాశం కోసం తాము కూడా ప్రయత్నిస్తున్నట్టు పతంజలి గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. పతంజలి గ్రూపు గ్లోబల్ మార్కెట్లో ఓ బ్రాండ్ గా ఎదిగేందుకు ఐపీఎల్ మంచి వేదిక అని భావిస్తున్నామని తెలిపారు. స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐకి ప్రతిపాదనలు పంపుతున్నట్టు వెల్లడించారు. అయితే, ఐపీఎల్ ను స్పాన్సర్ చేసేంత స్థాయిలో ప్రపంచవ్యాప్త వాణిజ్య పటిమ పతంజలికి లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

కరోనా వ్యాప్తి కారణంగా భారత్ లో వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో సమయం తక్కువగా ఉన్నందున బీసీసీఐ మరికొన్నిరోజుల్లో కొత్త స్పాన్సర్ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

More Telugu News