Sanitiser: యూట్యూబ్ లో చూసి శానిటైజర్ కంపెనీ పెట్టాడు... 16 మంది మరణానికి కారణమయ్యాడు!

  • మూడో క్లాసు వరకు మాత్రమే చదువుకున్న శ్రీనివాస్
  • తొలుత కిరాణా షాపులో పని చేసిన వైనం
  • లాక్ డౌన్ సమయంలో మాస్కులు, శానిటైజర్లు అమ్మిన శ్రీనివాస్
Life history of sanitiser owner who is responsible for 16 deaths in Kuruchedu

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని హైదరాబాదులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శానిటైజర్ కంపెనీ 'పర్ఫెక్ట్' యజమాని శ్రీనివాస్, ముడిసరుకు అందించిన ఇద్దరు మార్వాడీలు, మరో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నిన్న తెల్లవారుజామున వీరిని కురిచేడుకు తీసుకొచ్చారు. ఒకట్రెండు రోజుల్లో వీరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్ కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తొలుత ఒక కిరాణా షాపులో పని చేశాడు. ఆ తర్వాత పర్ఫెక్ట్ కిరాణా మర్చెంట్స్ పేరుతో ఒక దుకాణాన్ని నిర్వహించాడు. లాక్ డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్కులను విక్రయించాడు. వ్యాపారం బాగుండటంతో... సొంతంగా శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. పర్ఫెక్ట్ శానిటైజర్ పేరుతో తయారీని ప్రారంభించారు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు కూడా లేవు.

అయితే, శానిటైజర్ తయారీలో వాడాల్సిన ఇథైల్ ఆల్కహాల్ తో పాటు మిథైల్ క్లోరైడ్ ను వాడటం అతను చేసిన పెద్ద తప్పు. జనాలు ప్రాణాలు కోల్పోవడానికి ఇదే కారణమని పోలీసులు నిర్ధారించారు. కురిచేడులో కొన్ని మెడికల్ షాపులకు మాత్రమే ఈ శానిటైజర్లు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ మెడికల్ షాపులకు శానిటైజర్లు పంపిణీ చేసినట్టు విచారణలో తెలిసింది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News