Red Fort: కరోనా నేపథ్యంలో... ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలలో పాల్గొనే సైనిక, పోలీసు అధికారులపై కఠిన ఆంక్షలు!

  • వేడుకల్లో పాల్గొనే వారందరిపైనా ఆంక్షలు
  • ఇంటికి, రిహార్సల్స్ కు మాత్రమే పరిమితం
  • వందన సమర్పణలో భౌతికదూరం అసాధ్యమంటున్న అధికారులు
  • వేడుకలు ముగిసేంత వరకూ కుటుంబీకులు సైతం క్వారంటైన్
New Rules for Who Participate in August 15 Celebrations

పంద్రాగస్టు సమీపిస్తోంది. కరోనా మహమ్మారి విస్తరణ వేగం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసులపై ప్రత్యేక కరోనా ఆంక్షలను ఉన్నతాధికారులు విధించారు. వీటి ప్రకారం, ఈ అధికారులంతా కేవలం రిహార్సల్స్ కు వచ్చి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. మరెక్కడా తిరిగేందుకు వీల్లేదు. ఇక వారింట్లోని వారు, సహాయకులు, వంటవారు, డ్రైవర్లు, ఆగస్టు 15 ముగిసేంత వరకూ క్వారంటైన్ లోనే ఉండాలి.

ఆగస్టు 15న న్యూఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండటం, ఈ కార్యక్రమానికి ఎంతో మంది వీఐపీలు వస్తుండటంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రధానికి సమర్పించే వందన కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. అందువల్లే అదనపు జాగ్రత్తలు తీసుకున్నామని, ఈ వేడుకల్లో పాల్గొనే 350 మంది ఢిల్లీ పోలీసులను ఇప్పటికే కంటోన్ మెంట్ లోని కొత్త పోలీసు కాలనీలో ఉంచామని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాబిన్ హిబూ వెల్లడించారు. వేడుకల్లో పాల్గొననున్న వారిలో ఎవరిలోనూ ఇంతవరకూ కరోనా లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు.

ఇక, ఎర్రకోట వేడుకలకు పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతిస్తామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించాలని కోరారు. కాగా, ఇంతవరకూ ఢిల్లీలో 2,500 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారు. 14 మంది మరణించగా, మిగతా వారిలో అత్యధికులు కోలుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కేసుల పెరుగుదల రేటు నిదానించింది. ఓ దశలో రోజుకు 5 వేలకు పైగా కేసులు నమోదైన దేశ రాజధానిలో గత వారం రోజులుగా సగటున రోజుకు 1,500 కేసులు కూడా నమోదు కాలేదు. మొత్తం మీద ఢిల్లీ కేసుల సంఖ్య 1.40 లక్షలను దాటింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చామని కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

More Telugu News