Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు పిచ్చివాడేం కాదు... అలా నటిస్తున్నారంతే!: సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy comments on Chandrababu and tdp leaders
  • చంద్రబాబు వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్
  • అమరావతి సెంటిమెంట్ ను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపణ
  • రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే చెప్పించాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని విషయంలో విశాఖ ప్రజలను ఒత్తిడికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతి రైతుల సెంటిమెంట్ ను విశాఖ ప్రజలపై రుద్ది, తమకు రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే  చెప్పించాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. అది కూడా జనంలోకి వెళ్లకుండా, ఓ వీడియో సందేశంతో ఈవిధంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత కొన్నిరోజులుగా చంద్రబాబు చర్యలన్నీ ఈ విధంగానే ఉంటున్నాయని తెలిపారు.

విశాఖ ప్రజలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దనాలని, కర్నూలు వాళ్లు హైకోర్టు వద్దనాలని,  అమరావతి ఉంటేనే వికేంద్రీకరణ జరుగుతుందని రాష్ట్రంలో ఐదు కోట్ల మంది అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారని సజ్జల వెల్లడించారు. ఇందులోని వితండవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదని, కనీసం టీడీపీ నాయకులకైనా అర్థమవుతుందా? అని ఎద్దేవా చేశారు.

"వెనుకటికి ఓ సామెత ఉంది... పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాడట! చంద్రబాబు చెప్పే మాటలు చూస్తుంటే ఈ సామెత సరిపోతుందనిపిస్తుంది. కానీ, ఆయనకు పిచ్చి ఉందని భావించలేం. ఆయన మాట్లాడుతోంది పిచ్చి వల్లో, మతిభ్రమించడం వల్లో, మతి స్థిమితం లేకనో కాదు... అలా నటిస్తున్నారు. తన విస్తృత రాజకీయ అనుభవానికి తగ్గట్టుగా వ్యవహరిస్తే బాగుంటుంది.

తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తూ అందరినీ ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ చేయకుండా.. రాజధానిని అమరావతికి ఎందుకివ్వరు? మేం అడుగుతున్నాం ఇవ్వొచ్చు కదా, విశాఖ ప్రజలు జాలితోనైనా ఇవ్వొచ్చు కదా అని మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని అయితేనే వికేంద్రీకరణ జరుగుతుంది అన్నట్టు మాట్లాడడం, రాజీనామాలు చేసేయండి, మేం కూడా చేస్తాం, ఎన్నికల్లో చూసుకుందాం అనడం... ఇవన్నీ చూస్తుంటే పై సామెత గుర్తొచ్చింది" అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News