Raghu Ramakrishna Raju: గ్రామ వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ ఎంపీ తీవ్ర విమర్శలు

  • వాలంటీర్లు పని చేస్తే కరోనా కేసులు ఎందుకు పెరుగుతాయి
  • విశాఖకు వెళ్లే అంశంపైనే  ఆలోచిస్తున్నారు
  • ఫ్లాంక్లిన్ వార్తను సాక్షిలో ప్రచురించడం విడ్డూరంగా ఉంది
YSRCP MP Raghu Ramakrishna Raju criticises Volunteers

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. వాలంటీవర్ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నాయంటూ మన పార్టీ నేతలు మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. నిజంగా వాలంటీర్లు అద్భుతంగా పని చేస్తే... కరోనా కేసులు ఎందుకు పెరుగుతాయని ప్రశ్నించారు. శ్మశానాల్లో కూడా కరోనా టెస్టులు చేసేంత దారుణ పరిస్థితులు దాపురించాయని చెప్పారు. కరోనా విషయంలో చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

తాడేపల్లి కోవిడ్ సెంటర్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని రఘురాజు చెప్పారు. కరోనాను పట్టించుకోకుండా...  విశాఖకు వెళ్లే అంశంపైనే ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకుండా... ఫ్రాంక్లిన్ సంస్థ ఎందుకు కితాబిచ్చిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం విడ్డూరంగా ఉందని అన్నారు.  

సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ముఖ్యమంత్రి జగన్ కు చెక్కులు ఇచ్చినట్టు ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారని... అయితే ఏ ఎమ్మెల్యే కూడా సొంత డబ్బులు ఇవ్వలేదని, అదంతా ప్రజల డబ్బేనని రఘురాజు ఆరోపించారు. వాస్తవాలు జనాలకు తెలుసని చెప్పారు. ఈ విషయాలపై జగన్ దృష్టిని సారించాలని అన్నారు.

More Telugu News