Yanamala: స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలకు యనమల కౌంటర్

  • చట్టసభల విషయాల్లో కోర్టుల జోక్యం ఉండరాదన్న తమ్మినేని
  • చట్టవిరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయన్న యనమల
  • స్పీకర్ మాటలు సభలో ఒకలా, బయట మరోలా ఉన్నాయని విమర్శలు
TDP senior leader Yanamala replies to assembly speaker Tammineni Sitharama

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం నడుస్తోంది. చట్టసభల విషయాల్లో న్యాయస్థానాల జోక్యం ఉండరాదని స్పీకర్ తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, ఏదైనా అంశం చట్టవిరుద్ధం అయిన పక్షంలో చట్టసభల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయని, ఈ విషయాన్ని స్పీకర్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఓ సభలో ఆమోదం పొందిన చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టు దాన్ని ప్రశ్నించే వీలుందని స్పష్టం చేశారు.

రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీల వద్ద పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టుకు ఏజీ తెలిపినప్పుడు, ప్రభుత్వం ఆ బిల్లులను మరోసారి సభలోకి ఎలా తీసుకువచ్చిందని యనమల ప్రశ్నించారు. ఇది చట్టవిరుద్ధం కాబట్టే తమ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని వెల్లడించారు. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని, ఈ రెండు బిల్లులకు చెందిన శాసన ప్రక్రియ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ వివరాలను గౌరవనీయ అసెంబ్లీ స్పీకర్ తెలుసుకుంటే బాగుంటుందని యనమల పేర్కొన్నారు. స్పీకర్ మాటలు సభలో ఒకలా ఉంటే, వెలుపల మరోలా ఉంటున్నాయని విమర్శించారు.

More Telugu News