America: కొవిడ్ మరణాలకు ఈ ఐదే ప్రధాన కారణం: అమెరికా శాస్త్రవేత్తలు

five latest things that are leads to corona deaths
  • 299 మంది కొవిడ్ రోగులపై పరిశోధన
  • బయోమార్కర్ల స్థాయి పెరిగితే మరణాల ముప్పు
  • వీటిని ముందే గుర్తించడం ద్వారా చికిత్స ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చంటున్న శాస్త్రవేత్తలు
కొవిడ్ మరణాలకు కారణమయ్యే 5 ప్రధాన సూచీలను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా సోకిన రోగుల్లో ఐఎల్-6, డి-డిమర్, సీఆర్‌పీ, ఎల్‌డీహెచ్, ఫెరిటిన్.. ఈ ఐదు బయోమార్కర్ల స్థాయి ఎక్కువగా ఉండడమే చాలా వరకు కరోనా మరణాలకు కారణమని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

పరిశోధనలో భాగంగా 299 మంది కరోనా రోగులను పరీక్షించగా, వీరిలో 200 మందిలో ఈ బయోమార్కర్ల స్థాయి అత్యధికంగా ఉన్నట్టు గుర్తించారు. వీటి స్థాయి పెరగడం వల్ల ఇన్‌ఫ్లమేషన్, రక్తస్రావం వంటి రుగ్మతలు తలెత్తినట్టు గుర్తించారు. లీటరు రక్తంలో ఎల్‌డీహెచ్ స్థాయి 1200 యూనిట్లు, డి-డిమర్ స్థాయి మిల్లీమీటరుకు 3 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువైతే మరణం ముప్పు పెరుగుతుందని వీరు గుర్తించారు.

వీటిని ముందుగానే విశ్లేషించడం ద్వారా కొవిడ్ బాధితుల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం పొంచి ఉన్న వారిని గుర్తించవచ్చని పరిశోధనకు నాయకత్వం వహించిన శాంత్ అయానియన్ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఊబకాయం, గుండెజబ్బులు వంటి లక్షణాలు, వయసు ఆధారంగా ఇలాంటి వారిని గుర్తిస్తున్నట్టు చెప్పారు. రక్తంలో బయోమార్కర్ల స్థాయిని ముందే గుర్తించడం ద్వారా చికిత్స ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవచ్చని అధ్యయనకారులు వివరించారు.
America
Scientists
Corona Virus

More Telugu News