Anantapur District: ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు యువకుడి కరోనా నాటకం!

Bridegroom escaped from marriage with fake covid result
  • అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో ఘటన
  • నేటి రాత్రి వివాహం
  • తనకు కరోనా సోకిందని, క్వారంటైన్‌కు తీసుకెళ్తున్నారని ఫోన్
ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో దాని నుంచి తప్పించుకునేందుకు ఓ యువకుడు కరోనా నాటకం ఆడాడు. తనకు కరోనా సోకిందని, అధికారులు తనను క్వారంటైన్‌కు తరలిస్తున్నారని బంధుమిత్రులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయం ఆరా తీయగా అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలలో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన రాంకుమార్‌కు కొత్త చెరువుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. నేటి రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేని రాంకుమార్ నిన్న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, అధికారులు తనను అనంతపురంలోని నారాయణ కాలేజీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారని చెప్పాడు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి ఆరా తీయగా, రాంకుమార్ అనే వ్యక్తిని తాము క్వారంటైన్‌కు తరలించలేదని చెప్పారు. దీంతో విషయం ఏంటని ఆరా తీయగా, పెళ్లి ఇష్టం లేకనే అతడు ఈ నాటకానికి తెరతీసినట్టు తేలింది.
Anantapur District
bridegroom
Corona Virus
Marriage

More Telugu News