China: టిక్ టాక్ వ్యవహారంలో స్పందించిన చైనా... పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని అమెరికాకు హెచ్చరిక

  • టిక్ టాక్ పై నిషేధానికి ట్రంప్ నిర్ణయం
  • ఇది ఆధిపత్య ధోరణే అన్న చైనా
  • ట్రంప్ వైఖరిపై ఆగ్రహం
China warns US in Tik Tok issue

జాతీయ భద్రతను కారణంగా చూపుతూ అమెరికా ఇతర దేశాలకు చెందిన సంస్థలను అణచివేస్తోందని, ఈ ఆధిపత్య ధోరణిని పూర్తిగా ఖండిస్తున్నామని చైనా స్పష్టం చేసింది. టిక్ టాక్, వుయ్ చాట్ వంటి యాప్ లను మరో 45 రోజుల్లో నిషేధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ, తమ దేశానికి చెందిన వాణిజ్య సంస్థలకు తమ ప్రభుత్వ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కొన్ని పర్యవసానాలు కూడా ఉంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని వాంగ్ వెన్ బిన్ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో తమపై నిషేధాన్ని న్యాయపరంగా తేల్చుకోవాలని టిక్ టాక్ యాజమాన్యం భావిస్తోంది.

More Telugu News