Pattabhi: కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా జగన్ సర్కార్ కరోనా టెస్టింగ్ మాయాజాలం గుట్టు రట్టయింది: పట్టాభి

  • ఏపీలో కరోనా టెస్టులన్నీ బోగస్ అంటూ పట్టాభి విమర్శలు
  • 8.65 లక్షల టెస్టుల తేడా వస్తోందని వెల్లడి
  • ఆళ్ల నాని సమాధానం చెప్పాలంటూ డిమాండ్
TDP leader Pattabhi fires in AP government over corona testing numbers

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏపీలో కరోనా టెస్టుల సంఖ్యలన్నీ వట్టి బోగస్ అంటూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా జగన్ సర్కారు కరోనా టెస్టింగ్ మాయాజాలం గుట్టు రట్టయిందని తెలిపారు. ఇకనైనా ఏపీ సర్కారు నెంబర్ వన్ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, కరోనా నియంత్రణలో విఫలమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం జగన్ గాడినపెట్టాలని హితవు పలికారు.

"కరోనా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల జాబితాను కొన్నిరోజుల కిందట కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ పేరు ఎక్కడా లేదు. కారణమేంటని మేం అడిగితే... ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అది సాంకేతిక తప్పిదం అన్నారు. టెక్నికల్ ఎర్రర్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆగస్టు 4వ తేదీన కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఏపీలో కరోనా టెస్టులు ఎలా జరుగుతున్నాయో బట్టబయలైంది. ఆ జాబితాలో ఏపీ కూడా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు ఏపీలో 26,189 టెస్టులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

అంటే, ఏపీ జనాభా 5 కోట్లు కాబట్టి ఇప్పటివరకు 13,09,450 టెస్టులు చేసినట్టు భావించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం లెక్క. కానీ ఆగస్టు 4వ తేదీన ఏపీ సర్కారు తన బులెటిన్ లో పేర్కొన్న గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 21,75,070 టెస్టులు చేశామని చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన కేంద్రం వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూస్తే 8.65 లక్షల వ్యత్యాసం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ టెస్టుల వివరాలన్నీ బోగస్ అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది" అని విమర్శించారు.

తప్పుడు అంకెలు చూపించి ఎవరిని మోసగిస్తున్నారని పట్టాభి ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తున్న టెస్టులు బోగస్ అని కేంద్రం గణాంకాలతో బట్టబయలైన విషయం నిజం కాదా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం కరోనా టెస్టుల విషయంలో ఏపీ నెంబర్ వన్ కానేకాదని అన్నారు. కేంద్రం చెబుతున్న దానికి, రాష్ట్ర లెక్కలకూ ఎనిమిదిన్నర లక్షల తేడా ఉందని, దీనికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఏం సమాధానం చెబుతారని పట్టాభి ప్రశ్నించారు.

More Telugu News